డాన్ శాండీ దర్శకత్వంలో జీవా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. 'అర్జున్‌రెడ్డి' బ్యూటీ షాలినీ పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో మరో ముఖ్య పాత్రధారి కూడా ఉంది. అది ఓ 'చింపాంజి'. సినిమా మొత్తానికి హీరో, హీరోయిన్స్‌తో సమానంగా చింపాంజి కూడా తెరపై కనిపించబోతోంది. ఈ చింపాంజి ప్రత్యేకత ఏంటంటే, సినిమా షూటింగ్స్ కోసం వీటిని ప్రత్యేకంగా ట్రైన్ చేస్తారు.
థాయ్‌లాండ్‌లో దీని కోసం చాలా పెద్ద ఏర్పాట్లే ఉన్నాయి. అదో పరిశ్రమలా వెలుగుతోందక్కడ. హాలీవుడ్ సినిమా ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' కోసం ఇక్కడి నుండే చింపాంజీలను తీసుకెళ్లారు. జీవా సినిమా కోసం కూడా అక్కడి నుండే 'కాంగ్' అనే చింపాంజిని తీసుకొస్తున్నారు. దీనికి నాలుగు నెలల పాటు శిక్షణ కూడా ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ఇప్పిస్తున్నారు. నటీ నటులు, సాంకేతిక సిబ్బంది వీళ్లంతా, ఆ చింపాంజీకి పరిచయం అవ్వాలట.
'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' సినిమాలో చింపాంజీలు ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయో మనుషులతో సమానంగా ఎలా యాక్ట్ చేస్తాయో తెలుసు కదా. ఈ కాంగ్ కూడా అలాగే నటించబోతోందట. చాలా కాలం క్రితం జంతువుల మీద సినిమాలు వచ్చేవి. గొర్రెలు, ఆవులు, పాములు, కుక్కలు, ఏనుగులు, కోతులు తదితర జంతువులు నటించగా వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ మధ్య అలాంటి చిత్రాలు దాదాపుగా లేవు.
ఈ నేపథ్యంలో గ్రాఫిక్స్‌తో సంబంధం లేకుండా లైవ్‌గా చింపాంజీని తీసుకొచ్చి, దాంతో సినిమా చేయడం పైగా అది సినిమాలో ప్రధాన పాత్రలో ఒకటి కావడం చాలా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవుతుందట. ఇలాంటి సినిమాలకు భాషతో సంబంధం లేదు. కంటెన్ట్ కుదిరితే అన్ని భాషల్లోకి సినిమాని డబ్ చేసి విజయాన్ని అందుకోవచ్చు.