ప్రతీ అమ్మాయీ ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యే ఉంటుంది. చూపులతో కొందరు, మాటలతో కొందరు, చేతలతో ఇంకొందరు... ఇలా రకరకాలుగా ఆడదనం వేధింపులకు గురవుతూనే ఉంది. అయితే వీటిపై నోరు విప్పాలంటే మాత్రం భయం. తమ పరువునీ, జీవితాన్నీ ఎందుకు బయటపెట్టుకోవాలి? అన్న మీమాంశ.
అయితే సోషల్ మీడియా వల్ల ఆ భయాలు తొలగిపోయాయి. కథానాయికలు, సెలబ్రెటీలూ తమకు ఎదురైన ఆ చేదు అనుభవాల్ని గుర్తు చేస్తూ - ఈ తరాన్నీ జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరించే అవకాశం దక్కుతోంది. తాజాగా ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి తనపై జరిగిన లైంగిన వేధింపులపై తొలిసారి స్పందించింది.
చిన్మయికి ఈ చేదు ఘటనలు తొమ్మిదేళ్ల వయసులోనే ఎదురయ్యాయట. ఓరికార్డింగ్‌స్టూడియోకి వెళ్లి, ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఓ వ్యక్తి తనని చేతులతో తడిమేశాడని, మరోసారి ఓ పెద్దాయన తొడపై గిల్లాడని ట్విట్టర్‌లో తన గోడు చెప్పుకుంది చిన్మయి. ఆ వేధింపులు ఇప్పటికీ తగ్గడం లేదట. తనపై సానుభూతి,ప్రేమ కురిపించే నెపంతో తనని మాటలతోనే వేధించడం మొదలెట్టాడని, ఇప్పుడు అతన్ని పక్కన పెట్టేశానని చెప్పుకొచ్చింది. అయితే తనని వేధించిన వాళ్లెవరన్నది మాత్రం చెప్పలేదు.
సెలబ్రెటీలు ఇలా అడ్డుగోడలు బద్దలు కొట్టి మాట్లాడడం గొప్ప విషయమే. సెలబ్రెటీలకూ ఈ వేధింపులు తప్పడం లేదంటే.. సామాన్యుల పరిస్థితేంటో అనే ఆవేదన అందరిలోనూ వ్యక్తం అవుతోంది.