సెకండ్ వేవ్ తరవాత థియేటర్లు తెరచుకున్నాయి. పెద్ద సినిమాలన్నీ ఆగస్టు, సెప్టెంబరుల్లో రావడం ఖాయం అని అంతా లెక్కలేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ పెద్ద సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్ లలో క్లారిటీ రావడం లేదు. అక్టోబరులో ఆచార్య విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. అక్టోబరులోనే ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతోంది. ఆచార్యలోనూ చరణ్ ఉన్నాడు కాబట్టి.. ఈ రెండు సినిమాలకూ మధ్య నెల రోజుల గ్యాప్ అయినా ఉండాలి. నవంబరు, డిసెంబరు.. సినిమాలకు సీజన్ కాదు. కాబట్టి.. ఆచార్యని సంక్రాంతికి విడుదల చేద్దామని చిత్రబృందం భావించింది.
జనవరి 12న ఈ సినిమాని విడుదల చేయాలని కొరటాల శివ అనుకున్నాడట. అయితే.. అదే జనవరి 12.. పవన్ కల్యాణ్ రీమేక్ `అయ్యప్పయున్ కోషియమ్` సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంక్రాంతి కానుకగా.. జనవరి 12న విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. దాంతో ఆచార్యకి మరో అవాంతరం ఏర్పడింది. తమ్ముడి సినిమాతో అన్నయ్య పోటీ పడడం భావ్యం కాదు. కాబట్టి... ఈ రెండు సినిమాలూ ఒకే సీజన్ లో రావు. అంటే ఆచార్య ఫిబ్రవరిలో అయినా రావాలి.. లేదంటే డిసెంబరులోనైనా విడుదల కావాలి. ఇవి రెండూ.. సినిమాలకు మంచి సీజన్లు కావు. దాంతో.. ఆచార్య పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.