సెప్టెంబరు 1 నుంచి అన్ లాక్ 4 ప్రారంభం కాబోతోంది. అప్పటి నుంచి.. థియేటర్లు తెరచుకునే అవకాశాలున్నాయని చిత్రసీమ ఆశ పడుతోంది. కేంద్రం కూడా థియేటర్లకు అనుమతులు ఇచ్చేయొచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే... థియేటర్ల పునః ప్రారంభంపై.. కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్.
థియేటర్లలో సగం సీట్లకు అనుమతులు ఇస్తూ, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ... సినిమాలు ఆడించుకోవొచ్చన్న ఆశావాహ దృక్పథంలో ఉన్నారు థియేటర్ యజమానులు, నిర్మాతలు. సెప్టెంబరు 1 నుంచి అనుమతి వచ్చినా - సెప్టెంబరు చివరికి పరిస్థితి సద్దుమణిగే అవకాశం ఉంది. అక్టోబరు నుంచి యధావిధిగా చిత్రసీమలో ఫుల్ జోష్ రావొచ్చు. అందుకు తగ్గట్టుగా.. సినిమాల్ని రెడీ చేసుకుంటే మంచిదని నిర్మాతలు భావిస్తున్నారు.
కాకపోతే... థియేటర్లకు అనుమతి ఇస్తే.. కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థియేటర్ అంటే ఏసీ తప్పకుండాఉండాలి. పైగా.. తలుపులు మూసేయాలి. అంత ఇరుకు ప్రదేశంలో కరోనా ఇంకా విచ్చలవిడిగా మారే ప్రమాదం ఉంది. పైగా తినుబండారాలు, పార్కింగ్ ప్లేస్, టికెట్ కౌంటర్లు.. ఇలాంటి చోట ఆ ప్రమాదం మరింత ఎక్కువగా వుంది. ఒకవేళ థియేటర్లకు అనుమతులు ఇచ్చినా - ప్రేక్షకులు రావడానికి రెడీగా ఉన్నారా, లేదా? అనేది చూసుకోవాలి. థియేటర్లకు పర్మిషన్లు ఇస్తే.. రైళ్లు నడపడానికీ, స్టేడియాలు ఓపెన్ చేయడానికి అభ్యంతరం లేకపోవొచ్చు. ఇవన్నీ చూస్తే... ప్రభుత్వం కరోనా భారాన్నంతా ప్రజలపై వేసినట్టు ఉంటుంది. `మీ చావు మీరు చావండి` అని గాలికి వదిలేసినట్టు అవుతుంది. అది ప్రతిపక్షాలకు బలం. అందుకే.. థియేటర్లకు అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్రం ఒకటికి వందసార్లు ఆలోచిస్తుందడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి క్షణాల్లో థియేటర్లకు నో చెప్పినా, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.