రక్తదానం, నేత్రదానం, ఆక్సిజన్ దానంతో... ప్రాణదానం చేశాడు చిరంజీవి. తెలుగు ప్రజలకు అవసరమైన ప్రతీసారీ `నేనున్నా` అంటూ అభయహస్తం అందిస్తూనే ఉన్నాడు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు తన తరపున కోట్లాది రూపాయలు విరాళాలు అందించాడు. కరోనా సమయంలోనూ చిరు తనదైన రీతిలో స్పందించాడు. సీసీసీ ఏర్పాటు చేసి టాలీవుడ్ ని సంఘటితం చేశాడు.
కార్మికులకు నిత్యావసర వస్తువుల్ని అందించడానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు వాక్సినేషన్ ప్రక్రియ కూడా తనే దగ్గరుండి నడిపిస్తున్నాడు. త్వరలోనే చిరంజీవి నుంచి అంబులెన్సులు రానున్నాయని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ మండలంలోనూ ఓ అంబులెన్స్ ఉండేలా... చిరు తన సేవా కార్యక్రమాల్ని విస్కృతం చేయబోతున్నట్టు సమాచారం. ప్రజలకు ఇప్పుడు వైద్య సదుపాయాలు అత్యవసరమయ్యాయి. కరోనా బారీన పడిన రోగుల్ని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్సులు సరైన సంఖ్యలో లేవు.
ప్రైవేటు అంబులెన్సులు ఉన్నా, భారీ మొత్తంలో వసూలు చేసి, ప్రజల్ని పీడిస్తున్నాయి. ఈ దశలో అంబులెన్స్ సర్వీసుల అవసరం ఉందని చిరు గ్రహించాడు. అందుకే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాడు. త్వరలోనే దీనిపై ఓ సమగ్రమైన ప్రకటన చిరు నుంచి వచ్చే అవకాశం ఉంది.