నందమూరి బాలకృష్ణ - ఎన్టీఆర్... వీరిద్దరూ కొన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్నమాట వాస్తవం. అది నందమూరి అభిమానులు సైతం ఒప్పుకుని తీరే నిజం. అయితే.. ఇప్పుడు ఆ గొడవలు సర్దుబాటు అయిపోయాయని అనుకుంటున్నారంతా. ముఖ్యంగా నందమూరి హరికృష్ఱ మరణం తరవాత, ఆ కుటుంబానికి బాలయ్య పెద్ద దిక్కుగా మారాడు. బాబాయ్ లేదిదే కల్యాణ్ రామ్ ఏ కార్యక్రమమూ చేయడం లేదు. ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ వెళ్లడం రివాజుగా మారింది. అలా ఎన్టీఆర్, బాలయ్య కలిసిపోయారనిపించింది.
అయితే... వారిద్దరి మధ్య గోడలు పూర్తిగా కుప్పకూలలేదు. ఇప్పటికీ ఆ గ్యాప్ ఉంది. దానికి బాలయ్య చేసిన తాజా కామెంట్లే కారణంగా చూపిస్తున్నారు కొంతమంది. ఏపీలో టీడీపీ పతనావస్థలో ఉంది. టీడీపీకి పునరుత్తేజం రావాలంటే, ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని ఓ వర్గం వాదిస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ టీడీపీలో కీలకమైన స్థానాన్ని చేజిక్కించుకుంటారని గుసగుసలూ వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా బాలయ్యకు ఇష్టం లేదని, మరో వర్గం చెప్పుకొస్తోంది. బాలయ్య కామెంట్లు వింటే.. అది నిజమే ఏమో అనిపిస్తోంది. గురువారం బాలయ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొన్ని టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు బాలయ్య.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు అనే టాపిక్ వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి బాలయ్య ఇష్టపడలేదు. పైగా చాలాసేపు ఆలోచించాడు. `ఎవరికి వాళ్లు అలా అనుకోవడంలో తప్పులేదు` అని నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడు. ఎన్టీఆర్ రావడం ప్లస్సా? మైనస్సా? అనే ప్రశ్నకూ బాలయ్య నుంచి తింగరి సమాధానమే వచ్చింది. `కొన్నిసార్లు ప్లస్సు, ఇంకొన్నిసార్లు మైనస్... ముందు ప్లస్ అయి, ఆ తరవాత మైనస్ అవ్వకూడదు. ముందు మైనస్ అయి ఆ తరవాత ప్లస్ అయినా ఫర్వాలేదు` అంటూ అయోమయపు ఆన్సర్ ఇచ్చాడు. మరి మీరే రావొచ్చు కదా అంటే... `పార్టీ పగ్గాలు చేపడతా అని నేనెవరినీ అడగను. అలాంటి వ్యక్తిత్వం నాకు లేదు` అంటూనే ఇస్తే మాత్రం సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం నాకుంది... అంటూ సంకేతాలు పంపాడు.
మొత్తానికి బాలయ్య దృష్టి ఇప్పుడు పార్టీ పగ్గాలపై పడిందన్నది వాస్తవం. ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ఇస్తే, పార్టీలో తన స్థానం ఏమిటన్న సందిగ్థం కూడా బాలయ్యలో ఉందన్నది తాజా కామెంట్లతో అర్థం అవుతోంది.