టాలీవుడ్ కీ, ఏపీ ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. ఇదో కీలకమైన మలుపు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి చిరంజీవికి పిలుపొచ్చింది. చర్చలకు రమ్మని ఆహ్వానం అందింది. ఈ రోజు చిరు - జగన్ లమధ్య కీలకమైన భేటీ జరగబోతోంది. టికెట్ రేట్ల వ్యవహారంపై ఈరోజు చర్చ జరగబోతోంది. చిరు వెంట ఎవరెవరు వెళ్తారు? అక్కడ ఏయే విషయాలు చర్చకు వస్తాయి? అనేది తేలాల్సివుంది.
రేపటి నుంచి సంక్రాంతి సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజే భేటీ జరగడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. `టికెట్ రేట్లు పెంచుకోండి.. ఫర్వాలేదు` అని సీ.ఎం అంటే.. ఈ సంక్రాంతి సినిమాల నెత్తిమీద పాలు పోసినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.
`సినీ పెదరాయుడు పదవొద్దు.. పంచాయితీలు చేయను` అని చిరు నిర్మొహమాటంగా చెప్పేసినా.. ఏపీ ప్రభుత్వం చిరుని ఆహ్వానించడం కొసమెరుపు. చిరు వద్దనుకున్నా - ప్రభుత్వం, పెద్దలు, చిత్రసీమ చిరునే పెదరాయుడుగా ఉండమంటోందన్న మాట.
ఇటీవల రామ్ గోపాల్ వర్మ కూడా.. ఏపీ మంత్రితో భేటీ వేశారు. అయితే.. ఆ భేటీ తూతూ మంత్రంగా జరిగినట్టే అనిపిస్తోంది. ఇప్పుడు చిరుని ఆహ్వానించారు. పరిస్థితి చూస్తుంటే... ఈ భేటీతో టికెట్ రేట్ల వ్యవహారం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ చిత్రసీమ ఎంత ప్రయత్నించినా సీఎం అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఎట్టకేలకు సీ.ఎం నుంచి పిలుపొచ్చింది. అంటే.... ఈ సమస్యకు శుభం కార్డు కను చూపు మేరలో ఉన్నట్టే.