టాలీవుడ్ లో మరో దిమ్మ తిరిగే కాంబో రాబోతోందా? బాలకృష్ణ, బన్నీ కలిసి నటించబోతున్నారా? ఆ అవకాశాలు ఉన్నాయనే అంటోంది టాలీవుడ్. అటు బాలకృష్ణనీ, ఇటు బన్నీనీ దృష్టిలో ఉంచుకుని బోయపాటి శ్రీను ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టు రెడీ చేశాడని టాక్. అన్నీకుదిరితే అతి త్వరలో ఈ కాంబోని తెరపై చూసుకునే అవకాశం ఉందని సమాచారం.
సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించిన హిట్ మరోటి. బాలకృష్ణ - బోయపాటి ల కాంబో ఎంత శక్తిమంతమైందో ఈ సినిమాలే నిరూపించాయి. అఖండ కైతే అపూర్వ ఆదరణ దక్కింది. అఖండ 2 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బన్నీకి కూడా `సరైనోడు` రూపంలో అదిరిపోయే హిట్టు అందించాడు బోయపాటి. త్వరలోనే బన్నీతో మరో సినిమా చేయబోతున్నాడు.
అది కాకుండా.. బోయపాటి ఎప్పుడో ఓ మల్టీస్టారర్ కథ తయారుచేసుకున్నాడట. అందులో ఓ హీరోగా బాలయ్య ఖాయం. మరో హీరో బన్నీ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. త్వరలో బన్నీతో చేయబోయే సినిమా సోలో హీరోగానే ఉంటుంది. అది హిట్టయితే.... అప్పుడు బాలయ్యతో బన్నీ మల్టీస్టారర్‌కి ద్వారాలు తెరచుకుంటాయి. బోయపాటిపై బాలయ్య, బన్నీలకు ఎనలేని నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ మల్టీస్టారర్ కి పచ్చజెండా ఊపినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.