ఫిలింమేకర్లు చాలా విషయాలను రహస్యంగా ఉంచాలని అనుకుంటారు. పెద్ద స్టార్ హీరోల సినిమాలు, దర్శకుల సినిమాలకు సంబంధించిన వివరాలు బయటకు పొక్కకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే ఒక్కోసారి ఎగ్జైట్ మెంట్ ఎక్కువ అయిన సందర్భాలలో నటీనటులు కొన్ని అప్డేట్లను పుసుక్కున చెప్పేస్తారు. కొన్ని నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవి, తాజాగా శ్రియ ఇలా అప్డేట్లు చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలు ప్రకటించడం ఫిలింమేకర్ల వంతు అయింది.
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించక మునుపే చిరు ఓ సందర్భంలో ఫ్లో లో వెల్లడించారు. మెగాస్టారే స్వయంగా టైటిల్ వెల్లడించడంతో అది అధికారిక ప్రకటన లాగా మారిపోయింది. అప్పట్లో ఈ విషయంలో కొరటాల కాస్త నిరాశకు గురయ్యారని కూడా టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా హీరోయిన్ శ్రియ 'RRR' లో నటిస్తున్నానంటూ బాంబు పేల్చింది. 'RRR' లో శ్రియ పాత్ర గురించి ఎవ్వరికీ అసలు తెలియదు. కనీసం ఊహాగానాలు కూడా వినిపించలేదు. ఇలాంటి సమయంలో నేను నటిస్తున్నాని చెప్పడమే కాకుండా 'ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నటిస్తున్నాను. అజయ్ దేవగణ్ పక్కనే ఉంటాను' అంటూ హరికథ చెప్పినట్టు చెప్పింది.
శ్రియ నటిస్తున్న విషయమే జనాలకు తెలియదు.. అదే పుసుక్కున నోరు జారడం అనుకుంటే.. అసలు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సంగతి ఎవరికీ తెలియదు. అలాంటిది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని.. అందులో అజయ్.. నేను ఉంటామని చెప్పి 'RRR' టీమ్ ను ఇరుకున పెట్టింది. అటు రాజమౌళి, ఇటు 'RRR' టీం సభ్యులు ఎవరైనా సినిమా విశేషాలును గుట్టుగా ఉంచుతారు. ప్రతి అప్డేట్ ను ఓ స్ట్రేటజీ ఫాలో అవుతూ బయటపెడతారు. ఇప్పుడు శ్రియ దెబ్బకు 'RRR' టీమ్ కాస్త గుర్రుగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.