మెగాస్టార్.. చిరంజీవి. తెలుగు తెరపై తిరుగులేని కథానాయకుడు. చిరంజీవి తెరపై కనిపిస్తే చాలు. కథ కూడా అవసరం లేదని జనాలు నమ్మారు. పోస్టరుపై చిరంజీవి బొమ్మ ఉంటే చాలు.. కాంబినేషన్లు అక్కర్లేదని సినిమాలు తీశారు.
అయితే.. ఇప్పుడు కాలం మారింది. చిరంజీవి అంంతటి వాడే.. ప్యాడింగ్ ఆధారపడుతున్నాడన్నది విమర్శకుల మాట. ఫ్యాన్స్ కూడా అదే ఫీలవుతున్నారు. చిరు... రీ ఎంట్రీ ఇచ్చిన 'ఖైది నెంబర్ 150' పక్కాగా సోలో హీరో సినిమానే. అయితే 'సైరా' నుంచి ప్యాడింగ్ మొదలైంది. దానికి పాన్ ఇండియా కలరింగు ఇవ్వాలన్న ఆశ, ఆశయంతో అమితాబ్ బచ్చన్‌ని తీసుకొచ్చారు. సుదీప్, విజయ్‌సేతుపతి... ఇలా ప్రతి చిన్న పాత్రకూ పేరున్న నటులనే తెచ్చారు. 'ఆచార్య'లో ఏకంగా రామ్ చరణ్ నే రంగంలోకి దించారు. 'గాడ్ ఫాదర్'లోనూ అంతే.. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ ని తీసుకొచ్చారు. అయితే.. ఆచార్యలో చరణ్‌ని తీసుకొచ్చినా, గాడ్ ఫాదర్‌లో సల్మాన్ మెరిసినా, ఆయా చిత్రాలకు ఒరిగిందేం లేదు. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' విషయానికొద్దాం. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కీలక పాత్ర అనేదానికంటే సెకండ్ హీరో అనడం ఉత్తమం. చిన్న పాత్రగా రవితేజని తీసుకొచ్చి.. దానికి ఎలివేషన్లు ఇచ్చి.. సెకండ్ హీరో చేసేశారు. ఇప్పుడు ఇది మల్టీస్టారర్ సినిమా అయి కూర్చుంది.
చిరంజీవి సోలో హీరోగా చేస్తే జనం చూడరేమో? థియేటర్లు నిండవేమో అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారా? లేదంటే స్వయంగా చిరునే ఇలాంటి ప్యాడింగ్ కోరుకుంటున్నాడా? అనేది చిత్రసీమలో కొత్త చర్చను లేవనెత్తుతోంది. భోళా శంకర్ లో మాత్రం.. చిరు ఒక్కడే హీరో. అదొక్కటే మెగా ఫ్యాన్స్‌కి ఉపశమనం ఇచ్చే అంశం.