చిరంజీవి.. ఓ మెగాస్టార్. ఆయనతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? ఆయన రాజకీయాల్లోకి వెళ్లాక... `అయ్యో.. ఆయనతో సినిమా చేయలేకపోయామే` అని చాలామంది దర్శకులు బాధ పడ్డారు. కానీ చిరు రీ ఎంట్రీ ఇచ్చాక.. వాళ్లందరికీ ఊరట లభించింది. అంతేకాదు.. ఈమధ్య చిరు తన సినిమాల ఎంపికలో కూడా జోరు చూపిస్తున్నారు. `ఆచార్య`తో పాటు మరో మూడు సినిమాలకు చిరు అంగీకారం తెలపడమే అందుకు నిదర్శనం. చిరుతో సినిమా చేయాలని కలలు కంటున్నవాళ్లలో బోయపాటి శ్రీను కూడా ఉన్నాడు.
చిరు 152వ సినిమా బోయపాటితోనే అని టాక్ నడిచింది. గీతా ఆర్ట్స్లో ఈ సినిమా తీస్తామని అల్లు అరవింద్ కూడా చెప్పారు. కానీ. ఎందుకో ఈ సినిమా వర్కవుట్ కాలేదు. ఆ వెంటనే.. చిరు మరికొన్ని కథలు ఒప్పుకున్నా, బోయపాటికి ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో బోయపాటి - చిరు కాంబో సెట్ అవ్వదేమో అనుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు రంగంలోకి దిగి ఈ కాంబోని సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు టాక్. ఇటీవల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి బోయపాటి శ్రీను అడ్వాన్స్ తీసుకున్నారు.
మరోవైపు చిరంజీవి సైతం దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అందుకే అటు బోయపాటిని, ఇటు చిరునీ కలిపి ఓ సినిమా చేయాలని ఆయన భావిస్తున్నార్ట. బోయపాటి దగ్గర చిరుకి సరిపడ కథ ఉండడంతో... ఈ కాంబో సెట్టవ్వడం దాదాపు ఖాయమని దిల్ రాజు నమ్ముతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.