చిరంజీవి దృష్టి రీమేకులపై పడింది. తన రీ ఎంట్రీ ఖైది నెం.150తో జరిగిన సంగతి తెలిసిందే. అదో రీమేక్ అనే విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరు చేతిలో ఉన్న గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండూ రీమేకులే. ఇప్పుడు మరో మలయాళ కథపై చిరు ఫోకస్ పెట్టినట్టు టాక్.
మలయాళంలో ఇటీవల విడుదలైన చిత్రం `బ్రో డాడీ`. మోహన్ లాల్ కథానాయకుడు. పృథ్వీరాజ్ మరో కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. చిరు చేస్తున్న `గాడ్ ఫాదర్`కి `లూసీఫర్` మాతృక అన్న సంగతి తెలిసిందే. ఆ లూసీఫర్ కూడా మోహన్ లాల్ - ఫృథ్వీరాజ్ కాంబోలోనే వచ్చింది. ఇప్పుడు వాళ్లు తీసిన బ్రో డాడీ ని కూడా తనే రీమేక్ చేయాలనుకోవడం వింతేం లేదు. మోహన్ లాల్ పాత్రలో చిరు కనిపిస్తే, ఫృథ్వీరాజ్ పాత్రలో మరో హీరోని వెదుక్కోవాల్సి ఉంటుంది. మెగా కుటుంబంలో చాలామంది యువ హీరోలు ఉన్నారు కాబట్టి, సెకండ్ హీరో కోసం పెద్దగా వెదుక్కోవాల్సిన పనిలేదు. చిరు `డాడీ` అనే ఓ సినిమా తీసిన సంగతి తెలిసిందే. అది ఫ్లాప్. మరి ఈ బ్రో డాడీ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.