ఏపీలో అధికారం కోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అక్కడ కింగ్ కాలేకపోయినా.. కింగ్ మేకర్ అవ్వాలన్నది బీజేపీ వ్యూహం. అందుకే పవన్ కల్యాణ్ జనసేనని మచ్చిక చేసుకొంది. చిరంజీవిని కూడా తమ పార్టీలోకి లాగి.. బలం తెచ్చుకోవాలన్నది బీజేపీ ప్లాన్. చిరంజీవి బీజేపీలో చేరితే.. తననే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, తద్వారా.. ఏపీలో ఓ వర్గం ఓట్లని తమ వైపుకు తిప్పుకోవాలని ఆశించింది. అయితే.. ఎప్పటికప్పుడు ఆ వ్యూహాల్ని తిప్పి కొడుతూ వచ్చాడు చిరంజీవి. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. వేదికపై మోడీ కూడా చిరుని మర్యాదగా పలకరించడం.. అందరి దృష్టిలో పడింది. చిరంజీవితో బీజేపీ నేతలు కూడా మంతనాలు మొదలెట్టారు.
గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన అవార్డు కట్టబెట్టి.. చిరుపై తమ ప్రేమని చాటుకొంది బీజేపీ. ఇలాగైనా చిరంజీవి తమకు మద్దతు ఇస్తారన్నడి బీజేపీ ఆశ. అయితే.. చిరంజీవి మాత్రం రాజకీయాలపై తన విముఖత చూపిస్తూనే వచ్చాడు. చివరికి అవార్డు వేదికపై కూడా రాజకీయాలపై తన ఆనాసక్తిని చూపించేశారు. భవిష్యత్తులో సైతం రాజకీయాల్లోకి రానని, చివరి వరకూ సినిమా పరిశ్రమలోనే ఉంటానని ఈ వేదికపై కుండ బద్దలు కొట్టాడు. సో.. చిరుని రాజకీయాల్లోకి లాగడం కష్టమైన పనే.. అనే బిజేపీకి మరోసారి అర్థమైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా... బీజేపీ వైపు, రాజకీయాలవైపు చిరు చూడడని స్పష్టమైంది. సో.. బీజేపీకి ఇది పెద్ద షాకే.