`మా` డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రాజశేఖర్ అతి ఉత్సాహంతో, ఆగ్రవేశాలతో రసాభసగా మారింది. సభ జరుగుతుండగా సడన్ గా వేదికపైకి వచ్చిన రాజశేఖర్, పరుచూరి గోపాలకృష్ణ ప్రసంగిస్తుండగా మైకు లాక్కుని మరీ తన వాదన వినిపించడానికి ప్రయత్నించం అందరినీ షాక్‌కి గురి చేసింది. `మా`లో గొడవలు ఉన్నాయని, ఆ సంగతి చిరంజీవికి తెలీదని, నిప్పు లేనిదే పొగ ఎందుకు వస్తుందని, తనని తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారని.. తన గోడునంతా వెళ్లగక్కడానికి ప్రయత్నించాడు రాజశేఖర్. అయితే.. చిరంజీవి తదితరులు ఎంత చెప్పినా, రాజశేఖర్ శాంతించలేదు. మైకు లాక్కుని మాట్లాడడం సభా మర్యాద కాదని చిరంజీవి వారించినా రాజశేఖర్ వినిపించుకోలేదు. దాంతో చిరంజీవికి కోపం వచ్చింది.
ఇలాంటి సభలకు రావడం ఇష్టం లేకపోతే మానేయాలని, అంతే తప్ప వచ్చి, ఇలా కంగాళీ చేయకూడదని, తమ పెద్దరికంపై గౌరవం ఇవ్వలేనప్పుడు, ఇక్కడకు వచ్చినా లాభం ఏమిటని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇలా సభా మర్యాద పాటించనివాళ్లపైచర్య తీసుకోవాలని `మా`ని కోరారు. రాజశేఖర్ సృష్టించిన బీభత్సం వల్ల ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. చిరంజీవితో పాటు అతిథులంతా రాజశేఖర్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రాజశేఖర్‌పై ఎలాంటి చర్య తీసుకుంటారన్నది చూడాలి.