చిరంజీవితో మెహర్ రమేష్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. బడా బడా దర్శకులంతా చిరుతో సినిమా చేయడానికి తహతహలాడుతోంటే, ఫ్లాపు దర్శకుడిగా పేరు మూటగట్టుకున్న మెహర్ రమేష్‌కి ఎలా ఛాన్స్ ఇచ్చాడంటూ... ఆశ్చర్యపోయారు. నిజానికి మెహర్ రమేష్ దర్శకుల రేసులోనే లేడు. తను స్క్రిప్టుపై కూర్చుని చాలా కాలం అయ్యింది. దాదాపు అజ్ఞాతంలో ఉన్న మెహర్ రమేష్.... ఈమధ్య మహేష్‌బాబు టీమ్ లో చేరాడు. మహేష్ కి దాదాపుగా పీఆర్ గా వ్యవహరిస్తున్నాడు. సడన్ గా చిరు కాంపౌండ్ లో కనిపించడం మొదలెట్టాడు.ఇప్పుడు ఏకంగా చిరుతో సినిమా అంటున్నారు.
అయితే దీని వెనుక చిరు ఉద్దేశాలు వేరని తెలుస్తోంది. మెహర్ ఇప్పుడు చిరు కాంపౌండ్ లో ఉన్నాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, సీసీసీ కి సంబంధించిన పనులు చక్కబెడుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే.. సీసీసీ అమలు దిగ్విజయంగా జరగడానికి మెహర్ రమేష్ పాత్ర కీలకం. ఆ పనితీరుని చూసే చిరంవి `నీతో సినిమా చేస్తా` అని మాట ఇచ్చాడని తెలుస్తోంది. చిరు సినిమా చేయకపోయినా `ఆ మాట ఇచ్చాడు చాలు.. ` అంటూ మెహర్ రమేష్ ఉత్సాహంగా పనిచేస్తాడని చిరు ఉద్దేశం. మెహర్ కూడా ఇప్పుడు అత్యాశలకు పోవడం లేదట. చిరు చేస్తే చేశాడు, లేదంటే లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చిరు కోసం మెహర్ దగ్గర కథేదీ సిద్ధంగా లేదు. అంటే... ఇది కేవలం కాలక్షేపపు స్టేట్‌మెంట్లే అనుకోవాలి.