తెలుగు నిర్మాతలకు ఓవర్సీస్ ప్రధాన ఆదాయ వనరు. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. స్టారా, కొత్తవాడా అనే బేధం లేదు. సినిమా బాగుంటే ఆదరించే మనసు ఓవర్సీస్ ప్రేక్షకులకు ఉంది. ఇక్కడ రూపాయల్లో కురిసే కలక్షన్లు.. అక్కడ డాలర్లలో కురుస్తాయి. ఓవర్సీస్‌లో సినిమా హిట్టయితే.. నిర్మాతలకు, పంపిణీదారులకూ పండగే. అందుకే... ఓవర్సీస్ మార్కెట్‌పై దృష్టి సారిస్తుంటారు. అక్కడ ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలూ నిర్వహిస్తుంటారు.
తెలుగు సినిమా మార్కెట్ లో దాదాపు 25 శాతం వాటాని ఓవర్సీస్ ఆక్రమించుకుంది. అయితే.. కరోనా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌నీ మింగబోతోంది. లాక్ డౌన్ వల్ల థియేటర్ వ్యవస్థ, సినిమా కుదేలైపోయాయి. ఈ దెబ్బ నుంచి తేరుకోవడానికి చాలా కాలం పట్టేట్టు ఉంది. సినీ వర్గాల విశ్లేషణ ప్రకారం.. థియేటర్లు తెరచుకోవడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఇండియాలో థియేటర్లు తెరచుకున్నా ఓవర్సీస్‌లో మాత్రం థియేటర్ వ్యవస్థ పునరుద్ధరించడానికి ఇంకా చాలా సమయం పట్టేట్టుంది. అక్కడ ఒకవేళ థియేటర్లు తెరచుకున్నా, జనం సినిమాలు చూడ్డానికి ఆసక్తి చూపించరని విశ్లేషకులు చెబుతున్నారు.
థియేటర్‌కి వచ్చి సినిమా చూసే పద్ధతి క్రమంగా కనుమరుగవుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు సినిమానే ప్రధాన వినోద సాధనం. వీకెండ్ సినిమాతోనే కాలక్షేపం. అక్కడ టికెట్ల రేట్లు కూడా ఎక్కువ. అయినా సరే, నచ్చిన సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. కానీ రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కనిపించకపోవొచ్చు. ఎందుకంటే... లాక్ డౌన్ ఎత్తేశాక, ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా మారబోతోంది. జీతాలు తగ్గి, పని వేళలు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజానికి విదేశాల్లో స్థిరపడిన భారతీయుల ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయంలో.. థియేటర్లకు వచ్చి సినిమా చూడడం నిజంగా పెద్ద లగ్జరీనే. పైగా ఓటీటీ వేదికలు పెరిగాక... సినిమా అనేది ఇంటికే వచ్చేసింది.
నెల రోజుల్లో కొత్త సినిమాలు ప్రదర్శించుకునే వెసులు బాటు ఉండడం తో ఓవర్సీస్ ప్రేక్షకుడు అటువైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. పైగా ఓవర్సీస్‌లో సినిమాని విడుదల చేసే పద్ధతి కూడా మారబోతోంది. టీడీహెచ్ పద్ధతి ద్వారా నేరుగా ఇళ్లకే సినిమాని విడుదల చేసుకోవొచ్చు. సినిమా చూడాలనుకున్నవాళ్లు తగిన రుసుము చెల్లించి, వన్ టైమ్ వాచ్ పద్ధతిన ఇంట్లోనే, తమ టీవీల్లోనే కొత్త సినిమాలు చూసే వెసులు బాటు దక్కుతుంది. అంటే... ఓవర్సీస్ పంపిణీ వ్యవస్థ మొత్తం డీటీహెచ్ రూపంలో జరుగుతుందన్నమాట.
డీటీహెచ్ ప్రధాన ఆదాయ వనరుగా మారబోతోంది. అయితే.. పైరసీ బెడద నుంచి సినిమా తప్పించుకోవాల్సి ఉంటుంది. కొత్త సినిమాలు విడుదలైన రెండో రోజుకే హెచ్ డీ ప్రింటుతో బయటకు వస్తుంటాయి. అలాంటప్పుడు డీటీహెచ్‌లో అంత ఖరీదు పెట్టి సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవొచ్చు,. మొత్తానికి ఓవర్సీస్ మార్కెట్ కృంగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దర్శక నిర్మాతలు అందుకు సిద్ధమై ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాలి. లేదంటే... మరిన్ని భారీ నష్టాలు చవిచూడాల్సివస్తుంది.