గీతా ఆర్ట్స్ అంటే ప్రముఖ బ్యానర్. ఈ బ్యానర్‌లో చిరంజీవి చాలా విజయవంతమైన సినిమాలు చేశారు. తాజాగా ఇదే బ్యానర్‌లో వచ్చిన 'ధృవ' మంచి విజయం అందుకుంది. అలాగే చిరంజీవి రీ ఎంట్రీలో ఈ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యానర్‌లో చిరంజీవి చేసే సినిమా ఏదో మామూలు కమర్షియల్ స్థాయి సినిమా కాకుండా చరిత్రలో నిలిచిపోదగ్గ సినిమాగా ఉండాలని అల్లు అరవింద్ భావిస్తున్నారట. అందుకే ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ఈ బ్యానర్‌లో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఆ చిత్రంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుందట. మరో వైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌లో నటించాలని చిరంజీవి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకి చెందిన వ్యక్తి. స్వాతంత్రోద్యమంలో తొలి తరం నాయకుడిగా బ్రిటీష్ వారిని తన సొంత సైన్యంతో తరిమికొట్టిన నాయకుడిగా చరిత్రకెక్కిన గొప్ప వ్యక్తి. ఆయన తన పోరాటంలో బ్రిటీష్ వారి చేతికి చిక్కి ఉరికంబమెక్కారు. ఈ చరిత్ర దురదృష్టవశాత్తూ తెరమరుగైపోయింది. ఈ చరిత్ర ఇప్పుడు చిరంజీవి ద్వారా తెలుగు వారికి తెలియడం స్వాగతించదగ్గ విషయమే. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ కథని సిద్ధం చేశారు కూడా. అయితే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రమే అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కే అవకాశాలు లేకపోలేవు.