వెండితెరపై మెగాస్టార్‌గా వెలుగు వెలుగుతోన్న చిరంజీవి రాజకీయ రంగంలోనూ సత్తా చాటారు. ఇక ఇప్పుడు విద్యారంగంలో కూడా అడుగు పెట్టారంటూ, శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట ఓ విద్యాసంస్థను స్థాపించారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదంతా ఉత్తి ప్రచారమేననీ, ఇందులో చిరంజీవికి కానీ, ఆయన ఫ్యామిలీకి కానీ ఎలాంటి సంబంధం లేదనీ ఆ స్కూల్ సీఈఓ తాజాగా స్పష్టం చేశారు. మెగా కుటుంబానికి ప్రత్యేక అభిమానులమైన మేము ఈ స్కూల్‌ని స్థాపించాం.
ఆయన పేరుతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ స్కూల్‌ని స్థాపించాం. కానీ ఈ స్కూల్‌తో ప్రత్యక్షంగా చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం లేదు. అయితే, ఆయనపై ఉన్న అభిమానానికి గుర్తుగా, ఈ స్కూల్ గౌరవ వ్యవస్థాపకులుగా చిరంజీవి పేరునూ, గౌరవ అధ్యక్షునిగా రామ్‌చరణ్ పేరునూ, గౌరవ ఛైర్మన్‌గా నాగబాబు పేరునూ కోరుకుంటున్నామనీ, అంతే తప్ప వారికీ, ఈ స్కూల్‌కీ ఎలాంటి సంబంధం లేదనీ సీఈఓ జె. శ్రీనివాసరావు ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా ఈ స్కూల్ విషయమై జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, మెగా ఫ్యామిలీ నుండి ఎవ్వరూ దీనిపై స్పందించలేదు. తాజాగా స్కూల్ సీఈఓ స్పందనపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి 151వ సినిమా 'సైరా'తో బిజీగా ఉన్నారు. దసరాకి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్నా, నిహారిక కీలక పాత్రలు పోషిస్తుండగా, అమితాబ్‌బచ్చన్, సుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.