పరిశ్రమకు రోజుకో కొత్త హీరో వస్తున్నాడు. అందులో ఎవరు మెరుస్తారు? ఎవరు తెర మరుగైపోతారు అన్నది వాళ్ల టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. వెనుక ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, కేవలం ప్రతిభ, అదృష్టం మాత్రమే కొలమానాలుగా నిలుస్తాయి. వాటినే నమ్ముకుని వచ్చిన మరో కొత్త హీరో శివ కందుకూరి. `చూసీ చూడంగానే` సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు ఈయన. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో లాంటి సంచనల చిత్రాల్ని అందించిన నిర్మాత.. ఇప్పుడు తనయుడి కోసం ఎలాంటి సినిమాని తీశాడా? అన్న ఆసక్తి నెలకుంది. ఈ శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో యంగ్ టాలెంట్.. శివతో చిట్ చాట్.
* హాయ్ శివ..
- హాయండీ..
* మరికొద్ది గంటల్లో మీ సినిమా విడుదల అవుతోంది. టెన్షన్ ఫీలవుతున్నారా?
- చాలా.. డెబ్యూ మూవీ కదా. ఎవరికైనా ఇలాంటి టెన్షన్ తప్పదు. కాకపోతే.. ఓ మంచి సినిమా తీశామన్న నమ్మకం అయితే ఉంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
* ప్రేమకథతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వాలని అనుకున్నారా?
- అలా ఏం లేదు. ఓ మంచి కథ ఎంచుకుని వెళ్దామనుకున్నాను. అలాంటి సమయంలోనే శేష సింధు ఈ కథ నాకు చెప్పారు.
వినగానే బాగా నచ్చింది.
* ప్రేమకథేనా ఇంకేమైనా ఆసక్తికరమైన అంశాలున్నాయా?
- ఇదో స్వచ్ఛమైన ప్రేమకథ. మన జీవితంలో జరిగే సంఘటనలే తెరపై కనిపిస్తాయి. మన స్నేహితుడి జీవితమో, లేదంటే మనకు ఎదురైన అనుభవాలో కళ్లముందు కదులుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది.
* దర్శకురాలు శేష సింధుకి కూడా ఇదే తొలి సినిమా. ఆమె పనితీరు ఎలా వుంది?
- క్రిష్, సుకుమార్ లాంటి వాళ్ల దగ్గర శిష్యరికం చేసిందామె. ఇదే తొలి సినిమా అయినా సరే, చాలా క్లారిటీగా ఉండేవారు. ఆమెతో పనిచేయడం చాలా సులభం అయిపోయింది. సినిమా సెట్స్‌కి వెళ్లే ముందు 40 రోజుల పాటు వర్క్ షాపులు చేశాం. ప్రతీ సీనూ రిహార్సల్స్ చేయడం వల్ల సెట్లో ఏమాత్రం కొత్తగా, కష్టంగా అనిపించలేదు.
* అసలు నటనపై ఆసక్తి ఎప్పటి నుంచి?
- చిన్నప్పటి నుంచీ ఉంది. కాకపోతే.. నేను నటుడిగా సెట్ అవుతానా, లేదా? అనే అనుమానం ఉండేది. నేను అమెరికాలో చదువుకున్నాను. అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నాను. స్టేజీపై కొన్ని ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు నా స్నేహితులంతా `నువ్వు బాగా చేస్తున్నావు` అని మెచ్చుకోవడంతో నాపై నాకు నమ్మకం కలిగింది.
* ఈ సినిమా కోసం దాదాపు 12 రోజుల పాటు మిమ్మల్ని ఆడిషన్ చేశారట..
- అవునండీ. నాన్నగారికి నాకంటే సినిమానే ముఖ్యం. నా కోసం ఆయన ఈ సినిమా తీయలేదు. ఆ పాత్రకు నేను సరిపోతానని అనిపించి నన్ను ఎంచుకున్నారు. లేదంటే మరో హీరోని తీసుకుందురు. 12రోజుల పాటు ఆడిషన్స్ చేసినా, అవి చాలా సరదాగా గడిచిపోయాయి. ఏ సన్నివేశం ఎలా తీయబోతున్నాం? అందులో నేను ఎలా నటించాలి? అనే విషయాలపై ఓ అవగాహన వచ్చింది.
* పెద్ద దర్శకుడితోనో, హిట్ ఇచ్చిన దర్శకుడితోనో తొలి సినిమా ఉండాలని మీరు ఆశపడలేదా?
- అలా ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నాన్నగారి స్కూల్ చాలా కొత్తగా ఉంటుంది. ఆయన సినిమాలు గతంలో హిట్టయ్యాయి అంటే కేవలం కథా బలం వల్లే. అందులో స్టార్లెవరూ లేరు. నాకోసం ఆయన తన పద్ధతుల్ని మార్చుకోలేదు. కేవలం కథని నమ్మి మాత్రమే సినిమా తీశారు. నేను కూడా ఇలాంటి సినిమాతోనే లాంచ్ అవ్వాలనుకున్నాను.
* మీకు నచ్చిన కథానాయకుడు ఎవరు?
- చిరంజీవి గారంటే చాలా ఇష్టం. ఆయన స్ఫూర్తితోనే నటుడ్ని అవ్వాలనుకున్నాను. ఆయనో మెగాస్టార్. కానీ.. ఓ మంచి సినిమా వస్తే, చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ప్రోత్సహిస్తారు. ఆ లెక్క ఇంకెవ్వరికీ రాదు.
* తదుపరి సినిమాలేంటి?
- మరో సినిమా ఇప్పుడు సెట్స్‌పై ఉంది. అది కూడా త్వరలోనే విడుదల కానుంది. సృజన అనే ఓ దర్శకురాలు చెప్పిన కథ నచ్చింది. దాన్ని కూడా పట్టాలెక్కిస్తాం.
* ఓకే.. ఆల్ ద బెస్ట్
- థ్యాంక్యూ..