టాలీవుడ్‌లో నిర్మాత పేరు చెబితే ఓ దిల్ రాజు, ఓ అరవింద్, ఓ సురేష్ బాబు పేరే ఎక్కువగా వినిపిస్తుంది.
చిన్న నిర్మాతలకు అస్సలు గుర్తింపే లేదు, వాళ్ల ఉనికే కనిపించడం లేదనుకుంటున్న తరుణంలో... రాజ్ కందుకూరి మెరిశారు. పెళ్లిచూపులు సినిమాతో ఆయన చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాలకు ఊపిరి పోశారు. ఆ సినిమాతో జాతీయ అవార్డుని సైతం అందుకున్నారు. ఆ తరవాత వచ్చిన మెంటల్ మదిలో కూడా నిర్మాతగా రాజ్ కందుకూరి అభిరుచులకు అద్దం పట్టింది. అప్పటి నుంచీ చిన్న సినిమాలకు బ్రాండ్ అయిపోయారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి వస్తున్న చిత్రమే `చూసీ చూడంగానే`. ఈ సినిమాతో ఆయన తనయుడు శివ కందుకూరి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 31న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరితో చిట్ చాట్.
* హాయ్ సార్...
- హాయ్..
* అసలు ఈ ప్రాజెక్టు ఎలా మొదలైంది..?
- యేడాదికి ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేయాలన్న లక్ష్యంతో సినిమాలు చేస్తున్నాను. కనీసం ఓ దర్శకురాలినైనా తెలుగు తెరకు తీసుకురావాలని అనిపించేది. మనకు వాళ్ల సంఖ్య చాలా తక్కువ. కానీ వాళ్లలో చాలా ప్రతిభ ఉందని నా నమ్మకం. నందిని రెడ్డి, జయ లాంటి దర్శకులు తమదైన శైలిలో సినిమాలు తీయగలిగారు. అలాంటి దర్శకురాలి కోసం ఎదురు చూస్తున్న సమయంలో శేష సింధు నా దగ్గరకు వచ్చింది. ఓ కథ చెప్పింది. కథ బాగా నచ్చింది. కానీ ఎలా తీస్తుందో అని చిన్న భయం. అందుకే 5 నిమిషాల నిడివి గల ఓ వీడియోని తీసుకొచ్చి చూపించింది. తక్కువ బడ్జెట్‌లో చాలా సమర్థవంతంగా తెరకెక్కించిందని అనిపించింది. తనపై నమ్మకం పెరిగింది. అలా ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టుకుంది.
* హీరోగా మీ అబ్బాయే ఎందుకు? కథ డిమాండ్ చేసిందా? మీరు చేశారా?
- ఇది కూడా శేష సింధు ఆలోచనే. `ఈ సినిమాని నేను కొత్తవాళ్లతో చేద్దామనుకుంటున్నా` అని చెప్పింది. అందుకోసం ఆడిషన్స్ మొదలెట్టాం. అదే సమయంలో మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడని, తను కూడా నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. తనే `మీ అబ్బాయిని కూడా ఆడిషన్ చేస్తా` అని అడిగింది. అమెరికాలో రెండు డిగ్రీలు పూర్తి చేసి వచ్చాడు శివ. నటనపై మక్కువ ఉంది. అక్కడ నటనకు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి చేశాడు. ఇక్కడికి వచ్చి మళ్లా శిక్షణ తీసుకున్నాడు. అందరినీ ఓ గంటో, ఓ రోజో ఆడిషన్ చేస్తే శివని మాత్రం 12 రోజుల పాటు ఆడిషన్ చేసింది. ప్రతీ రోజూ ఓ సీన్ ఇచ్చి, `దీన్ని నువ్వయితే ఎలా నటిస్తావు` అని చెప్పి మరీ చేయించుకుంది. చివరికి `మీ అబ్బాయితోనే సినిమా చేస్తా` అంది.
మా అబ్బాయి హీరో కదా అని ఎక్కువ డాంబికాలకు పోలేదు. నిర్మాత కొడుకులా కాకుండా ఓ కొత్త హీరోలానే ట్రీట్ చేశాం.
* ఇది యూత్ ఫుల్ సినిమానా?
- అందరూ చూడదగిన సినిమా ఇది. ఓ సినిమా తీస్తున్నప్పుడు టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అనే ప్రశ్న చాలా అవసరం. నేను మాత్రం ఈ సినిమాని అందరూ చూసేలా తీశాను. ఎలాంటి అసభ్యత, అశ్లీలత ఉండదు కాబట్టి పెద్దవాళ్లు నిరభ్యంతరంగా చూడొచ్చు. ఇక పిల్లలంటారా? నా సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో సినిమాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ సినిమాలోనూ కథానాయిక పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. ఆడపిల్లలకు బాగా నచ్చుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కనెక్ట్ అయ్యే పాయింట్ ఈ సినిమాలో బలంగా ఉంది. యువతరానికి తప్పకుండా చేరువ అవుతాం.
* సురేష్ బాబు ఇన్వాల్వ్‌మెంట్ ఎంత వరకూ?
- పెళ్లిచూపులు, మెంటల్ మదిలో సినిమాలు రెండూ ఆయన ద్వారా విడుదలైనవే. ఈ సినిమాని కూడా ముందు నుంచీ గమనిస్తూనే ఉన్నారు. మధ్యమధ్యలో సీన్లు కూడా చూపించాం. ఈ సినిమా నిడివి 2గంటల 4 నిమిషాలు వచ్చింది. ఇంకా ట్రిమ్ చేయొచ్చేమో చూడండి అన్నారు. అలా ఓ పదినిమిషాలు ట్రిమ్ చేశాం. ఇప్పుడు పర్‌ఫెక్ట్ గా కుదిరింది.
* పెళ్లి చూపులు సినిమా తరవాత మీ ఆలోచనా ధోరణి మారిందా?
- అంతకు ముందు ఓ పది సినిమాలు వరకూ తీశాను. కానీ ఏ సినిమా ఇవ్వనంత గుర్తింపు, తృప్తి పెళ్లి చూపులు ఇచ్చింది. నాకు ముందు నుంచీ కొత్తవాళ్లని ప్రోత్సహించడం అంటే ఇష్టం. వాళ్లకో వేదిక చూపించాలి అనుకునేవాడిని. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో సినిమాలతో ఆ కోరిక తీరింది. ఇప్పుడు ఏ సెట్‌కి వెళ్లినా, నా సినిమా నుంచి బయటకు వచ్చిన టెక్నీషియనో, నటీనటులో కనిపిస్తారు. వాళ్లు చూపించే ప్రేమాభిమానాలు చూస్తే.. పది ఆస్కార్లు గెలిచినంత సంతోషంగా ఉంటుంది. ఓ పదేళ్ల తరవాత నేను ఈ పరిశ్రమకు ఏం చేయగలిగాను? అని వెనక్కి తిరిగి చూస్తే, ఎంతో కొంత కనిపించాలి. అది పెళ్లి చూపులుతోనే సాధ్యమైంది.
* శివకు నటుడు కావాలన్న ఆలోచన ఎప్పటి నుంచి ఉంది?
- పెళ్లి చూపులు, మెంటల్ మదిలో సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేముందు శివని అడిగాను. సినిమాలు చేసే ఉద్దేశం ఉందా? లేదా? అని. `లేదు` అని చెప్పేశాడు. ప్రస్తుతం చదువుపై శ్రద్ధ పెడుతున్నాను, డిగ్రీ పూర్తయ్యేంత వరకూ సినిమాల వైపు రాను అన్నాడు. అది నాకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఆ వయసులో చదువుపై ఫోకస్ చేయాల్సిందే. నా దగ్గరకు వచ్చే కుర్రాళ్లకు కూడా అదే చెబుతాను. `ముందు చదువు పూర్తి చేయండి. చదువు మానేసి ఇటు రావొద్దు` అని. ఎందుకంటే పిల్లలపై పెద్దలు ఎంతో నమ్మకం, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాటిని నిజం చేయాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది.
* ఈ సినిమా చూశాక ఓ తండ్రిగా ఏమనిపించింది? ఓ నిర్మాతగా ఏమనిపించింది?
- ఓ నిర్మాతగా మంచి సినిమా తీశానన్న సంతృప్తి కలిగింది. ఓ తండ్రిగానూ గర్వంగా ఉంది. నేను అనుకున్నదానికంటే 20 శాతం బాగా చేశాడనిపించింది. ఇప్పుడు నేనీమాట చెబితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవొచ్చు. కానీ ఈ సినిమా చూశాక ఈ మాట మీరే చెబుతారు. రషెష్ చూశాక మూడు ఆఫర్లు వచ్చాయి. ఓసినిమా షూటింగ్ కూడా పూర్తయింది. మార్చిలో విడుదల అవుతుంది.
* మీరు అనుకుంటే మీ అబ్బాయి కోసం ఓ పెద్ద దర్శకుడితో, భారీ సినిమా తీయొచ్చు కదా?
- చేయొచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు. ఓ సగటు కుర్రాడిలానే మా అబ్బాయి పరిచయం కావాలి అనుకున్నాను. తనని తాను నిరూపించుకున్న తరవాత పెద్ద సినిమాలు వెదుక్కుంటూ రావాలి.
* మీ సంస్థ నుంచి పెద్ద సినిమాలెప్పుడు వస్తాయి?
- చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు. అయితే.. పెద్ద సినిమాలు చేయడం అంత కష్టం ఏమీ కాదు. ఈజీనే. కానీ.. మనసుకి హత్తుకునేలా సినిమా తీయాలంటే వంద కోట్లు, యాభై కోట్లు అవసరం లేదు. మూడు కోట్లు చాలు. నిజానికి చిన్న సినిమాల్ని తీసి మెప్పించడమే చాలా కష్టం. పెళ్లి చూపులు సినిమాపై ఎవరికీ నమ్మకం ఉండేది కాదు. విడుదలకు ముందు చాలామందికి చూపించాడు. ఆడదేమో అన్నారు. కానీ ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అలాంటి సినిమా మళ్లీ ఎప్పుడు వస్తుందో నేను కూడా చెప్పలేను.
* దర్శకత్వం ఎప్పుడు?
- చేయాలనివుంది. కానీ ఇప్పుడే కాదు. కొత్తవాళ్లు సరికొత్త కథలతో వస్తున్నారు. ప్రోత్సహించాల్సిన ప్రతిభ చాలానే మిగిలివుంది.