చిరంజీవి పేరులో చిన్న మార్పు. ఆంగ్లంలో మరో `ఈ` ఎగస్ట్రాగా చేరింది. `గాడ్ ఫాదర్` పోస్టర్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లూ.. తమ పేర్లకు ఇలా చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఆ కోవలోనే ఇది కూడా. కాకపోతే.. కెరీర్ ప్రారంభంలో ఒకట్రెండు సినిమాలు చేసి, అవి హిట్టు కాకపోతే, అప్పుడు న్యూమరాలజీ ప్రకారం పేర్లకు రిపేర్లు చేస్తారు.
కానీ.. 150 సినిమాలు, నాలుగు దశాబ్దాల ప్రయాణం చేశాక.. ఇప్పుడు చిరు న్యూమరాలజీ నమ్ముకోవడం ఏమిటో ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకు అవకాశాలు ఇచ్చింది ఆ పాత `చిరంజీవి` అనే పేరే. ఆయన్ని మెగాస్టార్‌ని చేసింది కూడా ఆ పేరే. పద్మభూషణ్ సర్టిఫికెట్లోనూ.. ఆ పాత చిరంజీవే ఉంటాడు. ఇక కొత్తగా ఆయన సాధించాల్సింది ఏముంది? నిరూపించుకోవాల్సింది ఏముంది? కొత్తగా ఆయనకు పట్టాల్సిన అదృష్టం ఎక్కడ మిగిలి ఉంది? చిరు కష్టాన్ని నమ్ముకొచ్చాడు, కష్టపడి పైకొచ్చాడు అని ఈతరం చెప్పుకుంటుంది. అలాంటప్పుడు ఆయన అదృష్టాన్ని నమ్ముకోవడం ఏమిటో? అది కూడా ఇప్పుడు? అనేది అభిమానులకు కూడా అర్థం కావడం లేదు.
కొందరైతే.. ఇదంతా `ఆచార్య` ఎఫెక్టే అంటున్నారు. ఆచార్య ఫ్లాపే. కాదనం. అయితే... ఆచార్య కంటే ఘోరమైన ఫ్లాపులు చిరంజీవి ఇది వరకే చూసేశాడు. ఓ దశలో చిరు సినిమాలన్నీ వరుస ఫ్లాపులు. హిట్లర్‌కి ముందు ఆయన పరిస్థితి దారుణంగా ఉండేది. అందుకే కొంతకాలం సినిమాలకు బ్రేక్ కూడా తీసుకొన్నారు చిరు. అప్పుడే మారని పేరు.. ఇప్పుడు మార్చుకోవాల్సివచ్చిందేమిటో? లోగొట్టు.. చిరుకే ఎరుక.