కల్యాణ్ రామ్ కొత్త తరహా ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే అందులోనే కొత్త ఫార్మెట్ ఎంచుకుంటుంటాడు. అయితే.. ఎందుకనో ఈ మధ్య తనకు హిట్లు పడడం లేదు. పటాస్ తరవాత.. పక్కా కమర్షియల్ హిట్ కొట్టలేదు. ఇప్పుడు బింబిసారపై ఆశలు పెట్టుకొన్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా తనే. ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. చూడ్డానికి ట్రైలర్ భారీగానే ఉంది. అయితే మగధీర ఛాయలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. యుద్ధ నేపథ్యం, పునర్జన్మ.. ఇలా మగధీర రిఫరెన్సులు చాలా పట్టేస్తున్నారు జనాలు. అయితే.. ఈ సినిమాపై చాలా ఖర్చు పెట్టాడు కల్యాణ్ రామ్. తన కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమా ఇదే. వశిష్ట అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి, ఇంత ఖర్చు పెట్టడం నిజంగా రిస్కే.
అయితే ఇది ఒక సినిమాతో ఆగడం లేదు. నాలుగు భాగాలు తీస్తాడట. 2023 ఆగస్టు 23న రెండో భాగం వస్తుందని చెప్పేశాడు కల్యాణ్ రామ్. ఆ తరవాత యేడాదికి ఒకటి చెప్పున నాలుగేళ్లు బింబిసార సీజనే నడుస్తుంది. అంటే కల్యాణ్ రామ్ నాలుగేళ్ల పాటు ఒకే ప్రాజెక్టుతో బిజీగా ఉంటాడన్నమాట. అయితే... ఒకే ఒక్క కండీషన్. బింబిసార 1 హిట్టవ్వాలి. కనీసం... బింబిసార 2 తీయడానికి కావల్సినంత రెవిన్యూ సంపాదించి పెట్టాలి. అప్పుడే పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 తీస్తున్నప్పుడే పార్ట్ 2కి కావల్సిన కొన్ని సీన్లు తీసి పెట్టాడట కల్యాణ్ రామ్. అదొక ప్లస్ పాయింట్.
ఒక రకంగా ఇది పుష్ప, కేజీఎఫ్ ఫార్ములా అనుకోవాలి. కథా విస్తరణలో.. పెద్ద కథైపోవడంతో రెండు భాగాలుగా ఆ కథలు మారిపోయాయి. బింబిసార కూడా అలానే 4 భాగాల సినిమాగా మారి ఉంటుంది.