చిరంజీవిని మెగాస్టార్ అనే కాదు.. `లీకేజీస్టార్` అని కూడా అనాలేమో..?! ఎందుకంటే ఆయన ఇచ్చే లీకులు ఆ రేంజ్‌లోఉంటాయి మరి. సాధారణంగా సినిమాకి సంబంధించిన ఏదైనా విషయాన్ని.. చిత్రబృందంలో ఎవరైనా లీక్ చేస్తే.. హీరోలు సీరియస్ అవుతుంటారు.కానీ.. చిరు తన సినిమాలకు సంబంధించిన విషయాల్ని తానే లీక్ చేస్తుంటారు. ఇది చాలాసార్లు జరిగింది. తాజాగా మళ్లీ రిపీట్ అయ్యింది.
వాల్తేరు వీరయ్యకి సంబంధించి త్వరలో విడుదల కాబోతున్న పాటలోని బిట్ ని చిరు లీక్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతోంది. అక్కడ మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత లో ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. ఆ అందమైన లొకేషన్లని చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకొన్నారు. త్వరలో రాబోతున్న పాటలోని బిట్ లీక్ చేస్తున్నా.. ఎవరికీ చెప్పకుండా ఎంజాయ్ చేసేయండి... అంటూ పాటలోని బిట్ ని కూడా వినిపించారు. `నువ్వు శ్రీదేవైతే.. నేను చిరంజీవంట. రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు` అంటూ సాగే పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ గొంతులో వినిపించింది. ఈవారంలోనే లిరికల్ వీడియో బయటకు రాబోతోంది. అంతలోనే చిరు లీక్ ఇచ్చేసి, అభిమానుల్లో ఆనందాన్ని నింపేశారు. మరి పూర్తి పాట ఎలా ఉంటుందో చూడాలి.