‘‘జీవితంలో చాలా ఎత్తు పల్లాలు చూశారు. మీరు చూడని సక్సెస్ అంటూ లేదు.. ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన మీకెందుకు.?’’ అని మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తే, ‘నేనింకా నేర్చుకోవాల్సింది చాలా వుంది. మా ఇంట్లో చిన్న పిల్లలెవరైనా ఏదన్నా కొత్త లాంగ్వేజ్‌లో మాట్లాడితే, అది నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది. అలాగే, నాకు ఆనాటమీ అంటే ఇష్టం. మెడికల్ విషయాల గురించి తెలుసుకుంటుంటాను..’ అని చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను సాధించింది చాలా తక్కువే. ఇంకా సాధించాల్సింది చాలా వుంది. ఇది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ.. మనిషి జీవితమే అంత..’ అని చిరంజీవి అభిప్రాయపడుతుంటారు.
‘నాగబాబు ఎప్పుడు నాతో మాట్లాడినా క్వాంటమ్ థియరీ గురించి చెబుతుంటాడు. నేనూ ఆసక్తిగా అడిగి తెలుసుకుంటాను. డాక్టర్లతో మాట్లాడుతుంటాను. రకరకాల వైద్య చికిత్సల గురించి తెలుసుకుంటుంటాను..’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ‘నన్ను మించి నా పిల్లలు ఎదగాలనుకుంటాను.. చరణ్ కావొచ్చు, పవన్ కావొచ్చు.. మా ఫ్యామిలీలో మరొకరు కావొచ్చు.. వాళ్ళు విజయాలు సాధిస్తున్నప్పుడు.. కుటుంబ పెద్దగా నేను పొందే ఆనందం అంతా ఇంతా కాదు’ అని అన్నారు చిరంజీవి.