గత ఐదు రోజులుగా ప్రముఖ డైరెక్టర్, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత ఇన్ఫ్‌క్షన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరారు ఆయన. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుగానే ఉందంటూ కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది. ఈ సందర్భంగా ఆయనను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. నిన్ననే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కిమ్స్ ఆసుపత్రిలో దాసరిని పరామర్శించి, ఆయన త్వరగా కోలుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తాజాగా నేడు చిరంజీవి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, దాసరి తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న అనీ, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలియగానే సినీ పరిశ్రమ అంతా కలత చెందిందన్నారు. వ్యక్తిగతంగా తనకు దాసరి ఎంతో ముఖ్యులనీ, మంచి మనసుతో తనని ఎప్పుడూ ఆశీర్వదిస్తుంటారనీ, అలాంటి మనిషి ఇప్పుడు ఇలా ఆనారోగ్యానికి గురి కావడం చాలా బాధగా ఉందని చిరంజీవి అన్నారు. దాసరి నారాయణరావుకీ, చిరంజీవికి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఏదేమైనప్పటికీ దాసరి కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. రెండు రోజుల్లో ఆయన్ను వెంటిలేటర్ నుంచి తొలగిస్తామని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్ తొలగిస్తే దాసరి పూర్తిగా కోలుకున్నట్లే.