తారాగణం: నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర, పోసాని కృష్ణమురళి, ఈశ్వరరావు, సచిన్ ఖేడేఖర్, రావు రమేష్, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్ తదితరులు.
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సమర్పణ: దిల్ రాజు
స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: నక్కిన త్రినాధరావు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
కథా కమామిషు:
ఎలాగోలా అతి కష్టమ్మీద బీటెక్ పూర్తి చేస్తాడు బాబు (నాని). ఆ తర్వాత ఏం చేద్దామనుకునేంతలోపు కీర్తి (కీర్తి సురేష్)ని చూసి లవ్‌లో పడిపోతాడు. కానీ కీర్తి అంత తొందరగా నాని లవ్‌ని అంగీకరించదు. నానా తంటాలూ పడి కీర్తిని ప్రేమలో పడేసిన బాబుకి, కీర్తి తండ్రి నుంచి తొలి షాక్ తగలుతుంది. దాన్నుంచి తేరుకునేలోపే ఇంకో పెద్ద షాక్ ఓ పోలీస్ అధికారి నుంచి తగులుతుంది. ఆ పోలీస్ అధికారి (నవీన్‌చంద్ర), తాను ప్రేమించిన కీర్తి కోసం రౌడీల్ని చితకబాదుతాడు. అంతే, బాబుకి మైండ్ బ్లాక్. ఇప్పుడు నాని ఏం చేస్తాడు? తాను ప్రేమించిన కీర్తిని ఇంకెవరో ఇంకా గాఢంగా ప్రేమిస్తున్నారని తేలిసి, తన ప్రేమని ఎలా గెలిపించుకుంటాడు? అనేదే మిగతా కథ.
నటీనటులెలా చేశారు?
నాని తెరపై ఏం చేసినా బాగుంటుంది. కామెడీ చేసినా, కాన్ఫిడెంట్‌గా కనిపించినా, ఎమోషనల్‌గా నటించినా నాని తనదైన మార్కుని ప్రదర్శిస్తాడు. ఈ సినిమాలోనూ నానికి సవాల్ విసిరే పాత్ర అనలేంగానీ, మంచి పాత్రే దక్కింది. ఆ పాత్రలో చాలా అలవోకగా ఒదిగిపోయాడు నాని. ప్రతి సన్నివేశంలోనూ తనదైన నటనతో నాని ఆకట్టుకున్నాడు. డైలాగ్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అచ్చంగా ఈ తరం కుర్రాడెలా ఉంటాడో అలాగే ఉన్నాడు నాని.
'నేను శైలజ' ఫేం కీర్తి సురేష్ బాగా చేసింది. గ్లామరస్‌గానూ కన్పించింది. సహజమైన అందం ఆమె సొంతం. సహజత్వానికి దగ్గరగా ఆమె నటన కూడా ఉంటుంది. రొమాంటిక్ ఫీల్‌ని తన కళ్ళతోనే పలికించేసింది. నాని - కీర్తి సురేష్ కాంబినేషన్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఇద్దరూ నటన పరంగా ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.
నానికి తండ్రిగా కన్పించిన పోసాని కృష్ణమురళి, హీరోయిన్ తండ్రిగా సచిన్ ఖేడ్‌కర్ బాగా చేశారు. కీలకమైన పాత్రలో పోలీస్ అధికారిగా నవీన్ చంద్ర ఆకట్టుకుంటాడు. మిగతా నటులంతా సినిమాకి అవసరమైన మేర తమ నటనా ప్రతిభతో హెల్పయ్యారు. ఓవరాల్‌గా సినిమాకి కాస్టింగ్ బాగా కుదిరిందని చెప్పవచ్చు.
సాంకేతిక వర్గం పనితీరు:
సినిమాలో టెక్నికల్ యాస్పెక్ట్స్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీకి ఎక్కువ మార్కులు పడ్తాయి. సంగీతం కూడా సినిమాకి తగినట్లుగా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి పెద్ద ప్లస్. సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్‌నెస్ పెంచింది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉంది. ఆర్ట్, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్ ఓకే.
విశ్లేషణ
తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతే, క్యూరియాసిటీ ఉండదు. అదే ఈ సినిమాలో ప్రధాన లోపం. కథ చాలా సినిమాల్లో చూసేసిందే. దాంతో కొత్తదనం అన్న ఫీల్ కనిపించదు. అయితే ఎంటర్‌టైనింగ్ వేలో కథ చెప్పడం ద్వారా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నాని లాంటి నటుడు దొరకడంతో సినిమాని పూర్తిగా అదనే భుజాన మోసేసినట్లయ్యింది. అతనికి కీర్తి సురేష్ ప్లస్ అయ్యింది. నటీనటుల ప్రతిభ, కాస్తంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ సినిమా గ్రాఫ్‌ని తగ్గనివ్వలేదుగానీ, ప్రిడిక్షన్ ఈజీ కావడంతో సినిమా మరీ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. తొలి సగభాగంలో ఉన్నంత ఫన్, సెకెండాఫ్‌లో లేకపోవడం కొంచెం నిరుత్సాహపరుస్తుంది. ప్రీ క్లయిమాక్స్‌లో సాగతీత ఫీలింగ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఓవరాల్‌గా సినిమా మాత్రం పైసా వసూల్ అనే స్థాయిలోనే ఉంది. దానిక్కారణం నటీనటుల ప్రతిభ.
ఫైనల్ వర్డ్
నేను లోకల్ - సరదా సరదా ప్రేమకథ