చిత్రసీమలో కథానాయికల కొరతే కాదు, దర్శకుల కొరతా ఉంది. ప్రతీ దర్శకుడూ....ఏదో ఓ ప్రాజెక్టుతో బిజీ అయిపోతున్నాడు. ఇప్పుడు అగ్ర హీరోలకు సైతం దర్శకులు దొరకడం లేదు. తాజాగా చిరంజీవి పరిస్థితి కూడా ఇంతే. మలయాళంలో హిట్టయిన `లూసీఫర్`ని తెలుగులో రీమేక్ చేయాలని చిరు అనుకున్న సంగతి తెలిసిందే. ముందుగా సుజిత్ ని దర్శకుడిగా ఎంచుకున్నారు. తన స్థానంలో వినాయక్ వచ్చాడు. సృజనాత్మక విబేధాల వల్ల.. వినాయక్ సైతం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలిసింది.
వినాయక్ స్థానంలో హరీష్ శంకర్ పేరు గట్టిగా వినిపించింది. అయితే హరీష్ సైతం.. ఈ రీమేక్ చేయడానికి రెడీగా లేడని సమాచారం. ఇప్పుడు చిరుకి అర్జెంటుగా ఓ దర్శకుడు కావాలి. ఎందుకంటే.. `ఆచార్య` అవ్వగానే... లూసీఫర్‌నే మొదలెట్టాలన్నది చిరు ఆలోచన. మరోవైపు `వేదాళం` రీమేక్ సైతం రెడీ అవుతోది. ఈ రెండు చిత్రాల్నీ వీలైతే సమాంతరంగా మొదలెట్టాలని భావిస్తున్నాడట. అందుకే... దర్శకుడి కోసం చిరు అంతగా ఎదురు చూస్తున్నాడు. చిరు టేస్ట్ ని, లూసీఫర్ లో ఉన్న ఆత్మని అర్థం చేసుకునే దర్శకుడు ఎప్పుడు దొరుకుతాడో ఏంటో??