ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారంపై టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ విధానం వల్ల పెద్ద సినిమాలు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ రేట్లుంటే పెద్ద సినిమాలు విడుదల కావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పుడిప్పుడే చిత్రసీమ స్పందించడం మొదలెట్టింది. అందులో భాగంగా చిరంజీవి కొన్నికీలకమైన వ్యాఖ్యలు చేశారు.
చిత్ర పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం కోసం హర్షించదగ్గ విషయన్నారు. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం టికెట్ల రేట్లు ఉండాలంటున్నారు చిరంజీవి. కాలానుగుణంగా, దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా టికెట్ల రేట్లు ఉండాలంటూ ట్వీట్ చేశారు చిరు. దేశమంతా ఒకే ట్యాక్స్‌గా జీఎస్టీని ప్రభుత్వాలు వసూలు చేస్తున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం అని చిరు గుర్తు చేశారు. `` దయచేసి టికెట్ రేట్లపై పునరాలోచించండి..ప్రోత్సాహం ఉంటేనే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకుంటుంద``ని జగన్‌ను ట్యాగ్ చేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.చిరు బాటలో మిగిలిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు ముందుకొచ్చి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన తరుణం ఇది. మరి ఎవరేం చేస్తారో చూడాలి.