చిరంజీవి - పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలున్నాయనీ, ఆ కారణంగానే ఇద్దరూ ఈ మధ్య ఒకరికొకరు దూరంగా ఉంటున్నారనీ గుసగుసలు వినవస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య విబేధాలనే గాసిప్స్ కొత్త కాదు. అలాగే ఆ గాసిప్స్ ఉత్తవేననీ తేలడమూ రొటీన్ విషయమే. ఇంకోసారి ఇది నిరూపితమయ్యింది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. ముచ్చటించుకున్నారు. సరదాగా అన్ని విషయాలూ వీరి మధ్య చర్చకు వచ్చాయి. చిరంజీవి దగ్గర పవన్ కళ్యాణ్ ఇదివరకటిలానే తమ్ముడిగా అభిమానం ప్రదర్శిస్తే, పవన్ కళ్యాణ్‌ని తమ్ముడిగా ప్రేమతో చిరంజీవి దగ్గరకు తీసుకున్నారు. ఈ మెగా కలయికకు వేదిక రాజ్‌భవన్ కావడం గమనించదగ్గ విషయం. భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ శీతాకాల విడిది నేపథ్యంలో హైద్రాబాద్‌కి వచ్చారు. ఈ కారణంగా గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఎట్ హోం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
సినీ పరిశ్రమ నుండి సినీ నటుడు రానా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'బాహుబలి' సినిమాలోని ఓ పాటని ఇండియన్ ఐడల్, సినీ గాయకుడు రేవంత్ ఆలపించగా ఆహుతులు ఆ పాటను శ్రద్ధగా విన్నారు. మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ (రాజ్యసభ)గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అధిపతి హోదాలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. చిరంజీవి, పవన్ మధ్య జరిగిన చర్చల్లో రాజకీయ విషయాలు, అలాగే ఇరువురూ నటిస్తున్న తమ తమ సినిమాల విశేషాలు చర్చకు వచ్చాయి.
తాజాగా చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఆ విశేషాలను చిరంజీవి తన తమ్ముడితో పంచుకోగా, 'అజ్ఞాతవాసి' గురించి పవన్ తన అన్నయ్యకి వివరించారట.