సినిమా స్టార్లు.. రాజకీయాల్లోకి రావడం పెద్ద విచిత్రమేమీ కాదు. సినిమాల్లో బాగా క్రేజ్ తెచ్చుకున్నాక, వాటికి స్వస్తి పలికి... రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కామనే. కొంతమంది స్టార్లని ప్రజలే.. పిలుస్తారు. రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తారు. వాళ్లొస్తే సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తారు. అలాంటి డిమాండ్ చిరంజీవి విషయంలో వినిపించింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. వెళ్లిపోయారు. చిరు కంటే ముందుగా.. ఆ డిమాండ్ ఎక్కువగా రజనీకాంత్ విషయంలో వినిపించింది.
తలైవా రాజకీయాల్లోకి రావాలని.. ఎప్పటికప్పుడు అభిమానులు పిలుపు ఇస్తూనే వచ్చారు. రజనీకాంత్ కూడా.. రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ సంకేతాలు పంపుతూ ఉండేవారు. ఎట్టకేలకు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నా అని చెప్పి, సడన్ గా రూటు మార్చి `గుడ్ బై` చెప్పేశారు. అలా.. రజనీకాంత్ అభిమానుల కలను ఆదిలోనే... శుభం కార్డు పడిపోయింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావట్లేదిప్పుడు. ఆయన అభిమానులకు ఇంతకంటే చేదు వార్త ఇంకోటి ఉండదు.
రజనీ రాజకీయాలకు దూరం అవ్వాలన్న నిర్ణయం వెనుక చాలా కారణాలున్నాయి. అందులో ఆయన ఆరోగ్య పరిస్థితి ఒకటి. రాజకీయాల్లోకి వస్తే రాణించగలనా? లేదా? అనే భయాలూ ఆయన్ని వెంటాడుతున్నాయి. పరాజయం ఎరుగని ప్రయాణం రజనీది. ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూశారు. ఎనలేని క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు ఆయన సినిమాల నుంచి హాయిగా రిటైర్‌మెంట్ తీసుకొని, హాయైన జీవితం గడపొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి, ఈ బురద నేను చల్లుకోవడం ఎందుకు? అనే ఫీలింగ్ రజనీలో అణువణువూ ఉంది. పైగా రజనీ చేయించిన సర్వేలు ఆయనకు అనుకూలంగా రాలేదని మరో టాక్ వినిపిస్తోంది. ఓటమి భయం వల్లే రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని తమిళ నాట ఓ వర్గం గట్టిగా చెబుతోంది. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ గెలుపు ఓటమి సహజం.
ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని భయపడి పోటీలో నిలవకపోవడం నిజంగా.. అమాయకత్వమే. ఇలాంటి భయాలున్నా చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లు ధైర్యం చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ బురద చల్లుకున్నారు. వాళ్లు రాజకీయాల్లో గెలిచారా, లేదా? అనేది పక్కన పెడితే, కనీసం తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ. రజనీ అలాంటి సాహసానికి పూనుకోలేకపోయాడు. దాంతో రజనీని వేళాకోళం చేసే వాళ్ల సంఖ్య ఇప్పుడు మరింత ఎక్కువైంది. తమకు రజనీ ద్రోహం చేశాడని, తమ ఆశలపై నీళ్లు చల్లాడని.. స్వయంగా రజనీ అభిమానులే వాపోతున్నారు. ఈ విషయం తలైవా అభిమానులనే కాదు. అందరినీ నిరాశ పరిచాడన్నది వాస్తవం. తిరుగులేని నిజం.