చిరంజీవి, పవన్ కల్యాణ్ కలసి నటిస్తే ఎలా ఉంటుంది?? మెగా ఫ్యాన్స్‌కి ఇంతకంటే పండగ ఉంటుందా? ఈ కల ఇప్పుడు నిజం కాబోతోంది. చిరు, పవన్‌లతో సుబ్బరామిరెడ్డి ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చిరు, పవన్‌లతో ఓ సినిమా చేయబోతున్నా అని ఇటీవల సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. వారం తిరక్కుండానే ఈ సినిమా విషయమై అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఇటీవల చిరుతో సుదీర్ఘమైన మంతనాలు జరిపిన సుబ్బరామిరెడ్డి ఈరోజు పవన్, త్రివిక్రమ్‌లను కలసి మాట్లాడారు. పవన్, త్రివిక్రమ్ ఓకే అన్న తరవాతే... ఈ సినిమాపై ఓ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది చిత్రబృందం. చిరు ప్రస్తుతం తన 151వ సినిమా విషయంలో బిజీగా ఉన్నారు. పవన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఇవి పూర్తయ్యాకే ఈ మెగా కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, బన్నీలు కూడా కలసి నటిస్తారని తెలుస్తోంది. సో.. మెగా అభిమానులకు పండగే అన్నమాట.