నిన్న డయాలసిస్ నిలిపివేసిన వైద్యులు, దాసరి నారాయణరావుకి వెంటిలేటర్‌ని కూడా నేడు తొలగించారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చేరారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైన దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. అయితే వైద్యులు చాకచక్యంగా ఆయనకు సర్జరీ నిర్వహించి, ఇన్‌ఫెక్షన్‌ని నివారించే చర్యలు చేపట్టారు. కిడ్నీ, లివర్ సహా ఊపిరితిత్తులు కూడా మొదట మొరాయించాయి. దాంతో అన్ని విభాగాలూ కలిసి దాసరి నారాయణరావుని ప్రత్యేకంగా పర్యవేక్షించవలసి వచ్చింది. సర్జరీ చేసి, అన్నవాహికలోని ఇన్‌ఫెక్షన్‌ని తొలగించడంతోపాటుగా మెటల్ స్టెంట్ కూడా వేశారు వైద్యులు. శస్త్ర చికిత్స అనంతరం దాసరి నారాయణరావు చాలా వేగంగా కోలుకుంటున్నారని తెలియవస్తోంది. ఈ రోజు వెంటిలేటర్ కూడా తొలగడంతో దాసరి నారాయణరావు ప్రమాదం నుంచి బయటపడినట్లుగానే భావించవలసి ఉంటుంది. దాసరి కోలుకుంటున్నారన్న వార్తతో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. సినీ రంంగలో దాసరి నారాయణరావు అందరికీ తలలో నాలుక లాంటివారు. ఏ సమస్య వచ్చినా, సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ముందుగా దాసరితో తమ సమస్య చెప్పుకోవాలనుకుంటారు. అలాంటి దాసరికి తీవ్ర అస్వస్థత కలగడంతో సినీ పరిశ్రమ ఆందోళన చెందింది. ఇప్పుడాయన కోలుకుంటునారన్న వార్త సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షక లోకానికీ ఆనందాన్నిస్తోంది.