కృష్ణవంశీ అంటే చిరంజీవికి ప్రత్యేకమైన అభిమానం. ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు కానీ... కృష్ణవంశీపై ప్రేమని వీలైనప్పుడల్లా చూపిస్తూనేఉంటారు చిరు. తాజాగా రంగమార్తాండలో ఓ షాహెరీ కోసం చిరు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. అంతే కాదు.. ఇప్పుడు ఈ సినిమా చూసి కృష్ణవంశీనీ, ఈ చిత్రాన్నీ ఆకాశానికి ఎత్తేశారు. శుక్రవారం రంగమార్తండ చూశారు చిరు. అనంతరం ఆయన భావోద్వేగాల్ని ఈ రోజు ట్విట్టర్ వేదికగా పంచుకొన్నారు. ఈ సినిమా త్రీవేణీ సంగమంలా ఉందని, అప్రయత్నంగానే కన్నీళ్లొచ్చాయని కొనియాడారు.
''నేను 'రంగమార్తాండ' చూశాను. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఇది ఒకటి. ప్రతి నటుడికి తన జీవితాన్నే కళ్ళ ముందు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే, ఈ సినిమా ఓ 'త్రివేణీ సంగమం'లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక, వాటి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరి నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్ర చేయడం తొలిసారి. సెకండ్ హాఫ్ అంతా అప్రయత్నంగానే కంట తడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇటువంటి సినిమాలు అందరూ తప్పకుండా చూసి ఆదరించాలి. కృషవంశీ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ... చిత్ర బృందం అందరికీ ఆయన అభినందలు`` అన్నారు.