గత కొన్నిరోజులుగా చిరంజీవి ప్రమోషన్లతో బిజీగా గడిపేశారు. అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` కోసం. ఈ సినిమాకి తెలుగులో కాస్తో కూస్తో క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం చిరంజీవినే. ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ని చిరంజీవి కోసం అమీర్ ఖాన్ ప్రదర్శించడం, ఈ సినిమా చూసి చలించిపోయిన చిరు.. తొలిసారి ఓ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించడం తెలిసిన విషయాలే. ఈ సినిమా ప్రమోషన్లలో చిరు విరివిగా పాల్గొన్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఓ పరాయి భాషా చిత్రాన్ని ఇంతగా మోయడం చిరంజీవి కెరీర్‌లో ఇదే తొలిసారి.
చిరు ఇంతగా తపించిన లాల్ సింగ్ చద్దా సినిమా గురువారం విడుదలైంది. తొలి షోకే నెగిటీవ్ టాక్ వచ్చింది. అమీర్ కష్టం ఫలించిన దాఖలాలు కనిపించలేదు. సరికదా.. ఎక్కడా సరైన కలక్షన్లు లేవు. ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా రాకపోవడం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. అమీర్ ఖాన్ సినిమా అంటే మల్టీప్లెక్సులు ఫుల్ అవుతాయి. బీ,సీల్లో అంత ప్రభావం ఉండకపోవొచ్చు కానీ, ఏ సెంటర్లు మాత్రం కళకళలాడతాయి. దానికి తోడు నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించాడు కాబట్టి.. ఇంకొంచెం.. బజ్ వచ్చింది. ఇవన్నీ చూసి ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయని ఆశించారు. కానీ అది జరగలేదు. దానికి తోడు.. నెగిటీవ్ రివ్యూలు బాగా దెబ్బ కొట్టాయి. శుక్ర, శనివారాల్లో రెండు తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాల్ సింగ్ చడ్డా తెలుగు వెర్షన్ పూర్తిగా చతికిలపడినట్టే అనుకోవాలి. చిరు ఇంత చేసినా ఫలితం రాకపోవడం.. నిరాశపరిచే విషయమే.