దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ అశ్వినీదత్ నిర్మించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంకు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది . ఈ నేపధ్యంలో థాంక్ యూ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. నాగార్జున ఈవెంట్ కి అతిధిగా వచ్చారు. 'సీతారామం చూసి చాలా జలసీ ఫీలయ్యా. నాకు రావాల్సిన రోల్ దుల్కర్ కి వెళ్ళింది' అని చెప్పుకొచ్చారు నాగ్.
''ఇంత అందమైన చిత్రం చూసి చాలా రోజులౌతుంది. మృణాల్ పాత్రలో ప్రేమలో పడిపోయా. అంత అందంగా వుంది. ఎవరైనా ఆ పాత్రలో ప్రేమలో పడాల్సిందే. దుల్కర్ గొప్ప ఛార్మింగ్ వున్న నటుడు. దుల్కర్ ని చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. గత వారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు'' అని అభిప్రాయపడ్డారు నాగ్.