రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ సాక్షిగా పవన్ కల్యాణ్ చెలరేగిపోయారు. ఆయన స్పీచ్ - ప్రస్తావించిన అంశాలూ ఇండ్రస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తన ప్రసంగంలో కొంతమంది పేర్లని ఆయన ఉటంకించారు. ఏపీ మంత్రులతో పాటు మోహన్ బాబు, చిరంజీవి పేర్లనీ ఆయన ప్రస్తావనకు తెచ్చారు. ఇప్పటికైతే మంత్రులు మైకులు పట్టుకుని - తమ ప్రతాపాన్ని చూపించేశారు. `త్వరలోనే నేనూ స్పందిస్తా` అంటూ మోహన్ బాబు కూడా పవన్ కి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు చిరు ఏం చేస్తారన్నది అభిమానుల ప్రశ్న.
ఇండ్రస్ట్రీ తరపున ప్రభుత్వంతో రాయబారాలు నడుపుతోంది చిరునే. ఈ సమస్యని ఓ కొలిక్కి తీసుకురావడానికి ఆయన కొన్ని రోజులుగా నానా తంటాలూ పడుతున్నారు. అయితే పవన్ మాత్రం `అణిగిమణిగి ఉండొద్దు... ప్రాధేయపడొద్దు..` అని అన్నయ్యకూ సలహాలిచ్చాడు. దాంతో ఇప్పుడు చిరుపై కూడా స్పందించాల్సిన బాధ్యత పడింది. పవన్ కోపంలో అర్థం ఉంది. తాను కూడా ఇండ్రస్ట్రీ కోసమే మాట్లాడాడు. అయితే చిరు పంధా వేరు. పవన్ దారి వేరు. ఇప్పుడు పవన్ ని తప్పుబడితే ఓ బాధ, సమర్థిస్తే మరో తలనొప్పి. టికెట్ రేట్ల వ్యవహారం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చే వేళ.. పవన్ దాన్ని పక్క దారి పట్టించాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల బాధ. అది చిరుకీ ఉండి ఉండొచ్చు. దానిపై ఏం మాట్లాడినా అది మరో సమస్యకు, మరో వివాదానికీ నాంది అవుతుంది. జనసేన ఫ్యాన్స్ ని హర్ట్ చేసినట్టు అవుతుంది. చిరుది ముందు నుంచీ ఆచి తూచి అడుగులేసే వైఖరే. పవన్ లా దూకుడు ఉండదు. అందుకే ఈ విషయంలోనూ చిరు స్పందించడానికి రెడీగా లేరని టాక్. టికెట్ రేట్ల వ్యవహారంలో చిరు తన వంతు తాను కృషి చేశారు. దీనిపై పాజిటీవ్ గా స్పందించాలా? లేదంటే పవన్ పై కోపాన్ని ఇండ్రస్ట్రీపై చూపించాలా? అన్నది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం.