సందీప్ రెడ్డి వంగా... టాలీవుడ్ లో మాత్రమే కాదు, దేశమంతా ఈ పేరు మార్మోగిపోతోంది. అర్జున్ రెడ్డితో ఓ ప్రభంజనం సృష్టించిన వంగా, ఇప్పుడు యానిమల్ తో తన సత్తా మరోసారి గట్టిగా చాటి చెప్పాడు. సందీప్ తో సినిమా చేయడానికి టాప్ స్టార్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ తో సందీప్ 'స్పిరిట్' ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. స్పిరిట్ తరవాత సందీప్ సినిమా ఎవరితో? ఎప్పుడు ఉంటుంది? అనే విషయాలపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది.
త్వరలో యానిమల్ డైరెక్టర్.. మన మెగాస్టార్ చిరంజీవితో జట్టు కట్టబోతున్నాడు. చిరు అంటే.. సందీప్‌కి విపరీతమైన అభిమానం. సందీప్ ఫేవరెట్ హీరో చిరంజీవినే. ఈ విషయం చాలాసార్లు చెప్పాడు. చిరుతో కలిసి పనిచేయాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు. ఇటీవల చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకొన్నాడు సందీప్ రెడ్డి.
ఆ టైమ్ లోనే చిరంజీవి.. 'నాతో సినిమా చేయాలని ఉందని చెప్పావట.. మరి కథ ఉందా' అంటూ కూపీ లాగినట్టు తెలుస్తోంది. చిరంజీవి నుంచి సందీప్ ఇలాంటి డైలాగ్ ఊహించలేదు. అయినా సరే, వెంటనే తేరుకొని 'మీరు ఎప్పుడంటే అప్పుడే సార్' అంటూ బదులు ఇచ్చినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సందీప్ తో పని చేయడానికి చిరు కూడా సిద్ధమే. ఇక అడ్డేముంది? అన్నీ అనుకొనట్టు జరిగితే... 'స్పిరిట్' ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు.