గత ఎన్నికల్లో `జనసేన` ఒంటరిగానే పోరాడింది. దారుణమైన ఫలితాల్ని చవిచూసింది. స్వయంగా పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోవడం పవన్ అభిమానులు సైతం జీర్ణించుకోలేని విషయం. అయినా పవన్ అదరలేదు, బెదరలేదు. 2024 ఎన్నికల కోసం సన్నాహాలు మొదలెట్టేశారు. 2024లో జనసేన పార్టీ తప్పకుండా ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు కుటుంబం అండ దండలు కూడా పవన్‌కి కలసి రానున్నాయి.
ఈమధ్య చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు తమ కుటుంబం సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. దాంతో జనసేనలో ఎనలేని కొత్త ఉత్సాహం వచ్చింది. చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఆ తరవాత పూర్తిగా రాజకీయాలకు దూరం అవ్వడం ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన పనిలేదు. చిరు బీజేపీలో చేరతారని ఓ ప్రచారం కూడా జరిగింది. అయితే చిరు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడైతే చిరు పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారన్న సంగతి అర్థమవుతోంది. 2024లోగానీ చిరంజీవి, ఆయన కుటుంబం పవన్‌ని మద్దతుగా నిలబడి ప్రచారం చేస్తే, తప్పకుండా మంచి ఫలితాల్ని రాబట్టే అవకాశం ఉంది.
మెగా అభిమానులు చిరు ఫ్యాన్స్ - పవన్ ఫ్యాన్స్ గా విడిపోయారు. ఇప్పుడు వాళ్లూ ఏకం అవుతారు.చిరు ఉద్దేశం కూడా అదే. ఒకే కుటుంబంలో రెండు పార్టీలు ఉండకూడదని ఆయన భావన. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కల్యాణ్ కి అండగా నిలిచారు. చిరు దీవెనలే జనసేనకు శ్రీరామరాక్ష.