తన సినిమాల్లో సెంటిమెంట్ దట్టించడానికి త్రివిక్రమ్ ఎంత ఇష్టపడతాడో, నిజ జీవితంలో సెంటిమెంట్స్ పాటించడానికీ అంతే మొగ్గు చూపిస్తాడు. త్రివిక్రమ్ శైలిని, సినిమాలు తీసే విధానాన్నీ గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. త్రివిక్రమ్‌కి చాలా సెంటిమెంట్లున్నాయి. టైటిల్ లో 'అ' వచ్చేలా చూసుకోవడం త్రివిక్రమ్ అలవాటు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. రాబోయే సినిమాకీ 'అయిననూ పోవలె హస్తినకు' అంటూ ఆ సెంటిమెంట్ కంటిన్యూ చేశాడు. ఈమధ్య త్రివిక్రమ్ మరో అలవాటు చేసుకుంటున్నాడు. తన సినిమాల్లో ఓ యంగ్ హీరో కోసం ఓ పాత్రని డిజైన్ చేస్తున్నాడు. 'అజ్ఞాతవాసి'లో ఆది పినిశెట్టిని విలన్‌గా చూపించాడు.
`సన్నాఫ్ సత్యమూర్తి`లో శ్రీవిష్ణుకి ఓ పాత్ర ఇచ్చాడు. `అరవింద సమేత వీర రాఘవ`లో నవీన్ చంద్రకు కీ రోల్ ఇచ్చాడు. 'అల...వైకుంఠపురములో' కూడా అంతే. నవదీప్, సుశాంత్‌లకు మంచి పాత్రలు ఇచ్చాడు. ఈసారీ అంతేనట. ఎన్టీఆర్ సినిమాలో ఓ యంగ్ హీరో కోసం ఓ పాత్రని డిజైన్ చేసుకున్నాడట. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఫామ్ లో ఉన్న ఓ యువ హీరోనే ఆ పాత్ర పోషించనున్నట్టు సమాచారం అందుతోంది.