ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో... తన చేతిలో ఉన్న సినిమాలపై మరింత కేర్ తీసుకుంటున్నాడు చిరంజీవి. `వాల్తేర్ వీరయ్య` స్క్రిప్టులో భారీ మార్పులు జరిగాయని, భోళా శంకర్ విషయంలోనూ చిరు ఇప్పుడు మరింత జోక్యం చేసుకుంటున్నాడని వార్తలొచ్చాయి. `గాడ్ ఫాదర్` సినిమా దాదాపుగా పూర్తయ్యింది కాబట్టి, ఈ సినిమా విషయంలో చిరు చేసేదేం లేకుండా పోయింది. ముఖ్యంగా `వాల్తేరు వీరయ్య`పై చిరు బాగా ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో కామెడీకి ఎక్కువ స్పేస్ ఇవ్వాలని. కొన్ని ట్రాకులు రాయాలని, కామెడీ డోసు పెంచాలని దర్శకుడు బాబికి చెప్పాడట చిరు.
అంతే కాదు... ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ పాత్ర నిడివి ఇంకాస్త పెంచమని, తనతో కాంబో సీన్లు ఇంకొన్ని రాయాలని... దర్శకుడికి చెప్పాడట. దాంతో... బాబి మరోసారి ఈ సినిమా స్క్రిప్టు పట్టుకొని, రిపేర్లు మొదలెట్టాడని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిరు సినిమా అనగానే, దేవిశ్రీలో పూనకం వచ్చేస్తుంది. అదిరిపోయే పాటలు ఇచ్చేస్తాడు.
ఈ సినిమా కోసం కూడా.. క్యాచీ ట్యూన్లు రెడీ చేశాడట దేవి. అందులో చిరు... వేసే స్టెప్పులు వేరే లెవల్ లో ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా వాల్తేరు వీరయ్యలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆ మార్పులు ఫలితం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.