కరోనాతో దేశం అల్లాడిపోతోంది. తెలుగు రాష్ట్రాలు కుదేలవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ సిలెండర్లు అందక... కరోనా బాధితులు తల్లడిల్లుతున్నారు. ఆక్సిజన్ దేవో భవ.. అంటూ.. చేతులెత్తి మొక్కుతున్నారు. ఈ దశలో చిరంజీవి తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఓ మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ సిలెండర్ బ్యాంకుని నెలకొల్పాలని చిరంజీవి సంకల్పించారు. మరో వారం రోజుల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులోకి వస్తుందని రామ్‌చరణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కార్యక్రమాలన్నీ రామ్‌చరణ్ మానిటర్ చేస్తారని, మెగా అభిమానులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఓ ట్విట్టర్ ఖాతాను కూడా ప్రారంభించారు. ప్రతీ జిల్లాలోనూ ఓ ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేయడం నిజంగా గొప్ప విషయం. ఆక్సిజన్ సిలెండర్ల కొరతను ఈ ఆక్సిజన్ బ్యాంకులు దాదాపుగా తీర్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చిరంజీవి తరపై వస్తున్న విమర్శలకు ఈ ఆక్సిజన్ బ్యాంకులతో చెక్ పెట్టినట్టు అయ్యింది.
సోనూ సూద్ లాంటి వాళ్లని చూసి, చిరంజీవి లాంటి వాళ్లు నేర్చుకోవాలని, సామాజిక సేవ కోసం ముందుకు రావాలని... కొన్ని రోజులుగా గట్టిగా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. చిరు, నాగ్ కలిసి చేపల కూర వండుతున్న పిక్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. చేపల కూర వండాలంటే చిరుని అడగాలని, అదే విధంగా ఆక్సిజన్ కావాలంటే సోనూసూద్ ని సంప్రదించాలని సెటైర్లు వేశారు. ఇప్పుడు ... ఈ ప్రకటనతో చిరు వాటన్నింటికీ సమాధానం చెప్పినట్టైంది.