మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కనుంది. ఆగస్ట్‌లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభం కానుందని ఇప్పటికే ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆగస్ట్‌లో సినిమా ప్రారంభమవుతుందని చిరంజీవి తనయుడు, 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' నిర్మాత రామ్‌చరణ్ ప్రకటించి ఉన్నాడు. చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' సినిమాని చరణే నిర్మించాడు. సురేందర్‌రెడ్డితో 'ధృవ' సినిమా చేయడానికి ముందే, చిరంజీవితో సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌ని చరణ్ ఫైనల్ చేశాడట. ఇంకో వైపున చిరంజీవితో సినిమా చేయడానికి మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రెడీగా ఉన్నాడు. అన్నీ కుదిరితే ఆగస్ట్‌లోనే బోయపాటి - చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమవుతుందట. అంటే ఒకేసారి చిరంజీవి హీరోగా రెండు సినిమాలు పట్టాలెక్కుతాయని అనుకోవాలి. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పీరియాడికల్ మూవీ. ఆ సినిమా నిర్మాణానికి కొంత టైమ్ పడుతుంది. ఎక్కువ రోజులు షూటింగ్ జరుగుతుంది కాబట్టి షెడ్యూల్ గ్యాప్‌లో ఇంకో మూవీ కంప్లీట్ చేసెయ్యచ్చనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారని సమాచారమ్. బోయపాటి - చిరు కాంబినేషన్‌లో సినిమాని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్నారట. అయితే బోయపాటితో సినిమాకి సంబంధించి మెగా క్యాంప్ నుంచి ఎలాంటి అధికారిక న్యూస్ బయటకు రాలేదు. కానీ ఈ కాంబో ఫైనల్ అవడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.