మెగాస్టార్ నుంచి మల్టీస్టారర్ ఇంత వరకూ రాలేదు. ఆయన చేసిన తొలి మల్టీస్టారర్ `ఆచార్య`నే. అయితే అది ఫ్లాప్ అయ్యింది. అయినా సరే, చిరు ఇకపై మల్టీస్టారర్లే చేయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. చిరు చేస్తున్న సినిమా `గాడ్ ఫాదర్`. ఇందులో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓ రకంగా ఇది మల్టీస్టారరే. బాబి దర్శకత్వం వహిస్తున్న `వాల్తేరు వీరయ్య` కూడా మల్టీస్టారరే. ఎందుకంటే ఇందులో రవితేజ మరో హీరోగా నటిస్తున్నాడు.
చిరంజీవి చేతుల్లో `భోళా శంకర్` అనే మరో సినిమా ఉంది. ఇది సోలో హీరో సినిమానే అనుకొన్నారంతా. అయితే.. ఇందులోనూ మరో హీరోకి ఛాన్స్ ఉందట. ఆ పాత్ర కోసం నితిన్‌ని సంప్రదించింది చిత్రబృందం. అయితే నితిన్ కి కాల్షీట్ల సమస్య. తన సినిమాలు వెంట వెంటనే పట్టాలెక్కాల్సిన పరిస్థితి. ఈ దశలో... చిరుకి డేట్లు ఇవ్వగలడా, లేదా? అనేది అనుమానం. అందుకే మరో యువ హీరో కోసం అన్వేషిస్తున్నారు. చిరు ఇంట్లో హీరోలకు కొదవ లేదు. సాయిధరమ్, వరుణ్ తేజ్.. ఉండనే ఉన్నారు.
అయితే... మెగా హీరోల కంటే,ఈసారికి బయట హీరోలతోనే కలిసి నటిద్దాం అని చిరు భావిస్తున్నట్టు టాక్. అందుకే... ఇప్పుడు మరో హీరో కోసం అన్వేషణ మొదలెట్టారు. చూస్తుంటే,.. చిరుకి మరో హీరో లేకుండా సినిమా చేసే ఉద్దేశ్యమే లేనట్టుంది.