ఖైది నెం.150తో రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరు. ఆ సినిమా అభిమానులకు విపరీతంగా నచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఆనందించారు. ఆ తరవాత వచ్చిన సైరా పై భారీ అంచనాలు పెట్టుకొన్నారు. రామ్ చరణ్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమది. బాక్సాఫీసు దగ్గర అనుకున్న ఫలితం తీసుకురాలేదు. కాకపోతే... పెద్దగా విమర్శలూ ఎదురు కాలేదు. అయితే `ఆచార్య` మాత్రం మెగా అభిమానుల్ని తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. ఇది వరకెప్పుడూ చిరుకి ఇంతటి ఫ్లాప్ రాలేదు. దాంతో.. ఆయన సైతం కాస్త తగ్గి, వెనకడుగు వేసి, తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ దసరాకి.. చిరు కొత్త సినిమాల్ని ప్రకటిద్దామనే ఆలోచనలో ఉండేవారు. రెండు మూడు కొత్త స్క్రిప్టులు విన్న చిరు... వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా ఇవ్వాలనుకొన్నారు. అందులో మారుతి సినిమా కూడా ఉంది. అయితే `ఆచార్య` ఎఫెక్ట్ వల్ల.. ఈ ప్రయత్నాన్ని వాయిదా వేయబోతున్నారు. దసరా రోజున చిరు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన ఏదీ ఉండదని ఇన్ సైడ్ వర్గాల టాక్. మొన్నామధ్య `పక్కా కమర్షియల్` వేడుకలో మారుతితో సినిమా ఉండబోతోందని హింట్ ఇచ్చారు చిరు. అన్నీ కుదిరితే.. దసరాకి ఈ సినిమాని అనౌన్స్ చేసేవారు. ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా ఇప్పుడే మాట్లాడకూడదని చిరు నిర్ణయించుకొన్నట్టు సమాచారం.