రామ్ సినిమా `వారియర్` రేపే విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నా.. పెద్దగా బజ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు అడ్వాన్సు బుకింగులు చాలా డల్‌గా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్సుల్లో... సీట్లు ఇంకా ఖాళీగా కనిపిస్తున్నాయి. రేపటికి గానీ ఊపొచ్చే సూచనలు కనిపించడం లేదు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. థియేటర్లకు జనం వెళ్లి, సినిమా చూసే మూడ్ లేదు. అందుకే ఓపెనింగ్స్ అంత డల్‌గా ఉన్నాయి.
ఇప్పుడు తమిళ నాట ఈ సినిమాకి మరో సమస్య ఎదురైంది. ఈ సినిమాతో రామ్ తమిళంలోనూ ఘనంగా ఎంట్రీ ఇవ్వాలనుకొన్నాడు. అది సజావుగా సాగేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే.. లింగుస్వామికి తమిళనాట తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. తను గతంలో కొన్ని సినిమాల్ని నిర్మించాడు. వాటి తాలుకూ బాకీలు ఇంకా క్లియర్ చేయాల్సివుంది.
ఇప్పుడు ఈ సినిమాని అడ్డు పెట్టుకొని, పాత బాకీల్ని తీర్చమని అక్కడి బయ్యర్లు లింగుస్వామిపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. అవన్నీ క్లియర్ చేయడానికి నిర్మాతకు తల ప్రాణం తోకకు వస్తోంది. అక్కడ కూడా అడ్వాన్సు బుకింగులు ఇంకా మొదలవ్వలేదు. మొదలైనా.. జోరుగా టికెట్లు తెగే అవకాశం కనిపించడం లేదన్నది ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.