'బాహుబలి' సినిమాతో ఇప్పుడే పోల్చడం ఎంతవరకు సబబు? అనే అంశం పక్కన పెడితే, చిరంజీవి హీరోగా నటించనున్న కొత్త సినిమా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'కి సానుకూల వాతావరణాన్ని 'బాహుబలి' క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా మార్కెట్ చాలా చాలా పెరిగింది. చాలా తెలుగు సినిమాలు, తమిళంతోపాటు మలయాళ మార్కెట్‌నీ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దేశభక్తి నేపథ్యంలో రూపొందనున్న 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'ని దేశం మెచ్చేలా రూపొందించడానికి, దేశమంతా హర్షించేలా అన్ని భాషల్లో విడుదల చేయడానికి మార్గం లైన్ క్లియర్ అయినట్లుగానే భావించాలి. మార్కెట్ ఇంత సానుకూలంగా ఉన్నప్పుడు కథ. కథనాలపై ఇంకాస్త కసిగా వర్క్ చేసి, సినిమా రేంజ్‌ని ఇంకో రేంజ్‌లో భావించి సినిమా తెరకెక్కించడం, మార్కెటింగ్ చేసుకోవడంపై దృష్టిపెట్టవలసి ఉంటుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఓ తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి గాధ. ఆయన తెలుగు నేలపై దేశభక్తిని ఉప్పొంగించాడు. తన జీవితాన్ని స్వాతంత్య్ర పోరాటంలో త్యాగం చేశాడు. తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. వింటేనే రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే కథ ఇది. విజన్ ఉన్న దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ సినిమాకి పనిచేస్తుండడంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరో అద్భుత చిత్ర రాజం రాబోతోందని ఆశించవచ్చు. 'ఖైదీ నెంబర్ 150' లాంటి సాధారణ కమర్షియల్ సినిమాని అద్భుతంగా మార్కెట్ చేసిన చరణ్, నిర్మాతగా ఈ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని' కూడా మార్కెట్ చేస్తాడని ఆశిద్దాం.