మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా, ఆగస్ట్‌లో ప్రారంభమవుతుందనే వార్త ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ వార్త కంటే మిన్నగా అనేక గాసిప్స్ తెరపైకొస్తున్నాయి. తమ అభిమాన హీరోని వెండితెరపై చూసుకోవడానికి అభిమానులు చాలాకాలం వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్ళి దాదాపు తొమ్మిదేళ్ళు సినిమాలకు దూరమైన చిరంజీవి, అభిమానుల కోరికను తీర్చడానికి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో వచ్చారు. వస్తూనే సంచలనాలు సృష్టించారు. ఆ వేగం, వేడి తగ్గకుండానే ఇంకో సినిమాని అభిమానులు చిరంజీవి నుంచి ఆశించారు. అయితే చిరంజీవి మాత్రం ఆచి తూచి అడుగులేశారు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా చేయాలని నిర్ణయించుకుని, ఆ సినిమా కోసం కసరత్తులు ప్రారంభించారు. ఖైదీ విడుదలై ఆరు నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు చిరంజీవి తదుపరి సినిమా సెట్స్ మీదకు రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంకో వైపున బాలకృష్ణ సినిమా 'పైసా వసూల్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాంతో చిరంజీవి అభిమానులూ తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించి గుడ్ న్యూస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఇంకా ఉత్కంఠగా. ఇంకో వైపున ఎన్ని సినిమాలు చేశామనే కౌంట్ కాకుండా చిరంజీవి, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా చేయాలనే ఆలోచనతో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'పై ఫోకస్ పెట్టారు. ఆ సినిమాకి సంబంధించి ఏదో ఒక న్యూస్ అభిమానుల ముందుంచితే అంతకన్నా అభిమానులకు కావాల్సిందేముంటుంది? గాసిప్స్‌కి చెక్ పెట్టడంతోపాటుగా నిర్మాత చరణ్ నుంచి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'పై పూర్తిస్థాయి క్లారిటీ కోరుతున్నారు అభిమానులు.