ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన స్టార్.. మెగాస్టార్! ఆయన లానే స్వయం కృషితో ఎవరి అండదండ లేకుండా స్టార్‌గా మారాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ ఒకేసారి, ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరు కదూ. త్వరలోనే ఈ కాంబో చూసే ఛాన్సుందన్నది టాలీవుడ్ వర్గాల మాట.
చిరంజీవి తో లూసీఫర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకుడు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ఉంది. చిరు తనయుడిగా కనిపించే పాత్ర అది. అందులో చరణ్ నటిస్తాడని ముందు నుంచీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ.. ఇప్పుడు ఆ ప్లాన్ మారినట్టు సమాచారం. `ఆచార్య`లో ఎలాగూ చిరు - చరణ్‌ల లను చూడబోతున్నారు ప్రేక్షకులు. వెంటనే.. `లూసీఫర్`లోనూ అదే రిపీట్ చేస్తే, అంత క్రేజ్ ఉండకపోవొచ్చని చిరు భావిస్తున్నాడట. అందుకే చరణ్ స్థానంలో మరో యంగ్ హీరో అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. ఆ పాత్రలో ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే నిజమైతే - లూసీఫర్‌కి కొత్త కళ వచ్చినట్టే. మరి... విజయ్ ఏమంటాడో చూడాలి.