టాలీవుడ్ లో ఉన్న ప్రతిభావంతులైన యువ హీరోలలో శర్వానంద్ ఒకరు. ఈమధ్య వరస ఫ్లాపులతో డీలా పడ్డట్టుగా కొందరు అనుకున్నారు కానీ అదేమీ లేదు. ఈసారి కెరీర్ లో బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో ఉన్నాడట. శర్వానంద్ ఏకంగా అర డజను సినిమాలను లైన్లో పెట్టాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది.
శర్వానంద్ నటించిన 'శ్రీకారం' చివరి దశలో ఉంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. థియేటర్లు తెరిచిన తర్వాత రిలీజ్ కానున్న సినిమాలలో ఇది ఒకటి. ఇక శర్వానంద్ 'ఖైది' సినిమా ప్రొడ్యూసర్ నిర్మిస్తున్న ఓ తమిళ - తెలుగు ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇది రెండోది.
అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' లో నటించేందుకు పచ్చ జెండా ఊపాడు. ఇదో మూడో సినిమా. ఇవి కాకుండా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రెండు సినిమాలు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో లెక్క ఐదుకు చేరింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది ప్రాజెక్ట్ నంబర్ 6. ఈ సినిమాలన్నీ వచ్చే రెండేళ్ల కాలంలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం.