సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ లో చిరంజీవి స్పీచ్, మరీ ముఖ్యంగా విజయశాంతి గురించి చేసిన కామెంట్స్ హైలెట్‌గా నిలిచాయి. ఈ కార్యక్రమం అంతా ఒక ఎత్తు... చిరంజీవి - విజయశాంతి మధ్య జరిగిన సంభాషణ మొత్తం మరో ఎత్తులా నిలిచింది. ఆమధ్య రాజకీయాల్లో ఉండగా.. చిరు - విజయశాంతి మధ్య గ్యాప్ వచ్చింది. చిరుపై విజయశాంతి కొన్ని సెటైర్లు వేసింది. దాన్ని ఈ సందర్భంగా చిరు గుర్తు చేసుకోవడం విశేషం.
''విజయశాంతితో నాకు చాలా అనుబంధం ఉండేది. చెన్నైలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల్లా కలిసి ఉండేవాళ్లం. చిన్న ఫంక్షన్ అయినా సరే తన ఇంటికి నేను వెళ్లేవాడ్ని. నా ఇంటికి తను వచ్చేది. 19 సినిమాలు చేశాం'' అంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. పక్కనున్న విజయశాంతితో
''నీమీద నాకు చిన్న కోపం ఉంది. నాకంటే ముందు పాలిటిక్స్‌కి వెళ్లావ్. నన్ను ఆ మాటలు అనాలని మనసెలా వచ్చింది చెప్పు..? ఇందువరదన కుందరొదన, వానా వానా వెల్లువాయె.. పాట ఎన్ని పాటలు చేశామో. అవన్నీ గుర్తొచ్చాయి. రాజకీయాలు శత్రువుల్ని పెంచుతుంది. మా సినీ పరిశ్రమ స్నేహితుల్ని పెంచుతుంది. కొన్ని పరిస్థితుల్లో తాను కామెంట్ చేసినా, నేను మాత్రం అనబుద్ధి కాలేదు. ఒక్క మాటైనా నిన్ను అన్నానా? నాకు మనసు రాలేదు. అనాలనిపించలేదు'' అంటూ రాజకీయాల నాటి రోజుల్ని చిరంజీవి గుర్తు చేసుకోవడం విశేషం.
దానికి విజయశాంతి కూడా తెలివిగానే బదులిచ్చింది. ''రాజకీయం వేరు, సినిమా వేరు. అయినా మనం మిత్రులం. నా హీరో మీరు. మీరు నా హీరోయిన్. ఎక్కువ సినిమాలు మనమిద్దరం చేశాం. మళ్లీ మనం యాక్ట్ చేద్దామా..? ఎప్పుడూ మీ మీద నాకు గౌరవం ఉంది. అందుకే అన్ని సినిమాలు మీతో చేయగలిగాను. రాజకీయాల్లో పోరాడాలి. ఏం చేసినా ప్రజల కోసమే. వాళ్లు బాగుండాలనే నేను పోరాటం చేశాను'' అంటూ వివరణ ఇచ్చింది. మొత్తానికి సరిలేరు ఫంక్షన్‌లో పాత స్నేహితులిద్దరూ కలిసిపోయారు. వారి కలయిక ఈ వేడుకకు మరింత నిండుదనం తెచ్చింది.